యాదాద్రి భువనగిరి : కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు(MLA Samelu) వ్యతిరేకంగా సొంత పార్టీలోని అసమ్మతి వాదులు(Congress workers) సోమవారం మోత్కూరు స్థానిక ఎల్ ఎన్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతంతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ముఖ్యమైన సీనియర్ లీడర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట ఉన్నది కాంగ్రెస్ కేడర్ కాదని ఆరోపించారు.
నిజాయితీగా, నికార్సుగా గ్రామాల్లో పనిచేస్తున్నది కాంగ్రెస్ కార్యకర్తలేనని, వారిని పట్టించుకోకుండా సామేలు నిర్లక్ష్యం చేస్తున్నాడని మండిపడ్డారు. క్యాడర్ అంతా ఐక్యంగా ఉండి సామేల్ వైఖరిలో మార్పును కోరుతూ అధిష్ఠానంకు ఫిర్యాదు చేయనున్నామని చెప్పారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సూర్యపేట డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానంద చార్యులు, మోత్కూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగాల సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూర్ణచంద్రరావు, నాయకులు నారగోనం అంజయ్య, యుగేందర్ పలువురు పాల్గొన్నారు.