హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : బెస్ట్ అవైలబుల్ సూల్స్కు రూ.220 కోట్ల బకాయిల్లో కేవలం రూ.60 కోట్లు మాత్రమే విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకొన్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ సూల్స్, కాలేజీల్లో ఫుడ్, హెల్త్, టీచింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యల పరిషారం కోసం ఈ నిధులు వెచ్చిస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నదని అవి విద్యార్థుల భోజనానికి సరిపోతాయా? అని బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.
రాష్ట్రంలో మొత్తం 1,023 గురుకులాలుంటూ ఇందులో 600 ప్రైవేట్ భవనాల్లో నడుస్తున్నాయని వాటికి నెలకు చెల్లించాల్సిన రూ.20 కోట్లు అద్దెను ప్రభుత్వం ఏడాదిపైగా చెల్లించకపోవడంతో రూ.215 కోట్లు బకాయి ఉన్నదని గుర్తుచేశారు. ఇప్పటికే 250 బెస్ట్ అవైలబుల్ సూళ్లకు నుంచి విద్యార్థులను బయటికి పంపారని, 600 గురుకులాలకు తాళాలు వేశారని కొప్పుల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల ఇప్పటికే 110మంది విద్యార్థులు చనిపోయారని, ఇంకా ఎంతమంది ప్రాణాలు బలిగొంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు గురుకుల పాఠశాల వ్యవస్థను సక్రమంగా నడిపిస్తారా? నడిపించరా? అని నిలదీశారు.