కొత్తకోట, మార్చి 30 : ఆయిల్‌పాం ఫ్యాక్టరీని నిర్మించొద్దంటూ పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని సంకిరెడ్డిపల్లి తండా శివారులోని కొటేటేన్ గుట్టపై ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ భూమిలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టొద్దని చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే సంకిరెడ్డిపల్లి గ్రామం చుట్టు పక్కల గల సంకిరెడ్డిపల్లి కొత్త ఊరు, సంకిరెడ్డిపల్లితండా, కానాయపల్లి కొత్త ఊరు, కొత్తకోటకు చెందిన పలు కాలనీలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు.
ఈ గుట్ట నాలుగు గ్రామాల్లో ఉండే గొర్రెలు, పశువుల మేతకు ఉపయోగపడుతుందని, ఈ గుట్టను ప్రైవేటు ఐటీ కంపెనీ వారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని ఆయిల్‌పాం ఫ్యాక్టరీని ప్రారంభించడానికి సిద్ధమవుతుండటాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ధర్నాలో పాల్గొన్న వారంతా కాంగ్రెస్ కార్యకర్తలే కావడం విశేషం. ఫ్యాక్టరీని నిర్మించడానికి వీలు లేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాం గ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు చెప్పుతో కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యేను తీవ్రంగా దుయ్యబట్టారు.