హైదరాబాద్, అక్టోబర్ 22(నమస్తే తెలంగాణ): వరంగల్‌లోని నమస్తే తెలంగాణ పత్రిక కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని జర్నలిస్టు సంఘాల నేతలు, సీనియర్ జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. తమపై వార్తలు రాస్తున్నారని అధికార పార్టీ నేతలే మీడియా కార్యాలయాలపై దాడులకు తెగబడితే శాంతిభద్రతలను ఎవరు కాపాడతారని ప్రశ్నించారు. పత్రికల్లో రాసిన వార్తలపై అభ్యంతరాలున్నప్పుడు చట్టప్రకారం ముందుకు వెళ్లాలి గానీ ఇలా భౌతికదాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు ‘నమస్తే’ కార్యాలయంపై దాడికి యత్నించడంపై మండిపడ్డారు.
దాడులు కరెక్ట్ కాదు
ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మంచి ది కాదు. ఇది పత్రిక స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావించాల్సి ఉంటుంది. వార్తల విషయంలో నిజానిర్ధారణ చేసుకోవాలి లేకుంటే కోర్టుని ఆశ్రయించాలి. అంతే కాని దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల సభ్యసమాజం తలదించుకుంటుంది.
– దాదన్నగారి మధుసూదన్‌రావు,సీనియర్ న్యాయవాది, నిజామాబాద్
పత్రికా యూనిట్‌పై దాడికి యత్నం హేయమైన చర్య
వరంగల్‌లో ‘నమస్తే తెలంగాణ’ యూనిట్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించడం హేయమైన చర్య. పత్రికలు నిజానిజాలను రాసినప్పుడు స్వీకరించాలే తప్పా దాడులకు పాల్పడడం సరైంది కాదు. వార్తల విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులు, చట్టాలు ఉన్నాయి. పత్రికపై దాడిని ప్రజాసామ్యంపై దాడిగానే చూడాల్సి వస్తుంది.
-వనపట్ల సుబ్బయ్య, నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు
ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం అమానుషం
వరంగల్ నమస్తే తెలంగాణ కార్యాలయంపై వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు దాడి చేయడం పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమే. పత్రికా కార్యాలయం మీద చేసి పత్రిక ప్రతులను చింపి, అకడ ఉన్న మహిళా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం ప్రజాస్వామ్య విలువలను పాతర వేయడమే.
– పల్లె రవికుమార్, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
అధికారంలోకి రాగానే రెచ్చిపోతున్నారు
కాంగ్రెస్ కల్చర్‌లోనే దాడుల విధానం కనిపిస్తుంటుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండుసార్లు అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు నాయకులు రెచ్చిపోతున్నారు. తమను ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. ఇందులో భాగంగానే నిత్యం ప్రజాసమస్యలను గొంతెత్తి చాటుతున్న ‘నమస్తే తెలంగాణ’పై దాడికి యత్నించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా భావించే మీడియా గొంతునొక్కడం దుర్మార్గం. ప్రజాస్వామికవాదులందరూ సంఘటితమై కాంగ్రెస్ దురాగతాలను ఎదుర్కొవాలి.
– టంకశాల అశోక్, వార్తా పత్రిక మాజీ ఎడిటర్
అభ్యంతరాలుంటే ఖండించాలి
తెలుగు రాష్ట్రాల్లోని పాలకుల్లో ఫాసిస్టు ధోరణి పెరగిపోతున్నది. తమకు ఎదురుగా మాట్లాడిన, నచ్చని వార్తలు ప్రచురించినా ఓర్వడంలేదు. దాడులు చేయడమే మార్గంగా ఎన్నుకున్నారు. ఇదే తరహాలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు యత్నించిన ‘నమస్తే తెలంగాణ’పై అధికార పార్టీ ముసుగులో ఉన్న మూకలు దాడులకు తెగబడడం దుర్మార్గం. ప్రచురించిన వార్తలో ఏమైనా అభ్యంతరాలుంటే ప్రెస్‌మీట్ పెట్టి ఖండించవచ్చు.
– వర్ధెల్లి మురళి, సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్
జర్నలిస్టు సమాజం చూస్తూ ఊరుకోదు
పత్రికా ఆఫీసుపై దాడి బాధాకరం. ఇలాంటి దుర్మార్గాలను జర్నలిస్టు సమాజం చూస్తూ ఊరుకోదు. అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే జర్నలిస్టు సంఘాలన్నింటినీ కలుపుకొని ఉద్యమిస్తాం.
– మారుతి సాగర్, టీయూడబ్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
– రమేశ్ హజారే, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు
– యోగానంద్, టీయూడబ్య్లూజే కోశాధికారి
-విష్ణువర్ధన్‌రెడ్డి, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు
– ఏ రమణకుమార్, టెంజు ప్రధాన కార్యదర్శి