Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళిత అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బలి పెట్టను న్నదా? తొలి సీటు కొట్టేసి, పొత్తులో ఇచ్చేసి.. నాలుగో సీటును దళిత నేతకు వదిలేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 5 స్థానాలు ఖాళీ అవుతుండగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ గరిష్ఠంగా మూడు ఎమ్మెల్సీ స్థానాలే గెలుచుకునే అవకాశం ఉన్నది. ఇందులో ఎన్నికల పొత్తు హామీ మేరకు ఒక స్థానం తమకు ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబడుతున్నది. మరో సీటు కోసం మజ్లిస్ లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ రెండూ పోతే కాంగ్రెస్ నికరంగా గెలిచేది ఒక సీటే. ఈ ఒక్క సీటును తన ప్రాణమిత్రుడు, ఓటుకు నోటు కేసు నిందితుడు వేంనరేందర్‌రెడ్డికి కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శాయశక్తుల కృషి చేస్తున్నట్టు తెలిసింది. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని పూర్తిగా పక్కకు పెట్టాని ఆ పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది. నాలుగో సీటు కోసం దళిత అభ్యర్థిని నిలబట్టి బలిపెట్టే దిశగా కసరత్తు జరుగుతుందని గాంధీభవన్ వర్గాల్లోనే తీవ్ర చర్చ జరుగుతున్నది.
అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిపి 66మంది ఎమ్మెల్యేల (కాంగ్రెస్ 65+సీపీఐ 1) బలం ఉన్నది. ఎన్నికల ఫార్ములా ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడానికి 21 మంది ఎమ్మెల్యేల తొలి ప్రాధాన్య ఓట్లు అవసరం. ఈ లెక్కన ఎటువంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలు మాత్రమే గెలువగలుగుతుంది. ఒకవేళ ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు వచ్చి కలుస్తారు. దీంతో నాలుగో అభ్యర్థిని నిలబెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలిసింది.
ఈ లెక్కన కాంగ్రెస్‌లో మూడు స్థానాలకు 63 మంది ఎమ్మెల్యేలు పోగా, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి ఏడుగురు సభ్యులు కలిసినా 10 మందే అవుతున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల ఓటు బలంతో మరోకటి గెలవడం అసాధ్యం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి గోడదూకిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కే ఓటు వేసే విధంగా ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆ 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుండగా, వారిలో ఎంతమంది కాంగ్రెస్‌కు అనుకూలంగా నిలబడతా రు? వీళ్లను నమ్ముకొని నాలుగో అభ్యర్థిని నిలబెడితే పరువుపోయే పని చేస్తారేమోనని తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది. అయినా గూడ దూకిన 10 మంది ఎమ్మెల్యేలు కలిపినా మొత్తం 20 మందే అవుతారు. ఇంకో అభ్యర్థిని నిలబెట్టాలంటే 21 మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతుంది.
ఒప్పందంలో భాగంగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని తమకు కేటాయించాలని సీపీఐ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నేతలు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆ పార్టీ నేతలు కలిశారు. దీంతో సీపీఐకి ఒక సీటు కేటాయిస్తే, నమ్మకంగా ఓటు వేసే ఎమ్మెల్యేలను కేటాయించి, సేఫ్ జోన్లో ఉంచేలా కాంగ్రెస్ చొరవ తీసుకుంటుందని చెప్తున్నారు. ఒకవేళ మజ్లిస్‌తో పొత్తు కుదిరినా వాళ్లకున్న ఏడుగురు ఎమ్మెల్యేల బలానికి తోడు కాంగ్రెస్ నుంచి 14 మంది నమ్మకంగా ఓటు వేసే ఎమ్మెల్యేలను అప్పగించి సేఫ్ జోన్లోనే ఉంచాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ఒకవేళ మజ్లిస్‌తో పొత్తు లేకుంటే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దయాకర్ సేఫ్ జోన్లోకి వెళ్లిపోతారని, లేకుంటే ఆయనే డేంజర్ జోన్లో ఉంటారని కాంగ్రెస్ వర్గాలే అంచనా వేస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. అందులో10 మంది గోడ దూకి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే ఒక అడుగు ముందుకేసి తాను బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనని, కాంగ్రెస్ నాయకులు కొందరు కావాలనే ఫెక్సీలలో తన ఫొటో వాడుకొని వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బ తీస్తున్నారని ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వీళ్లు ఎటుపైపు ఉంటారనేది స్పష్టత లేదు. మరో ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపితే, కాంగ్రెస్ నుంచి మూడో అభ్యర్థి (ఏంఐఎంతో పోత్తు కుదిరితే రెండోఅభ్యర్థి) బలికావాల్సి వస్తుందని రాజకీయ వర్గా ల్లో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్, పీపీఐ, ఎంఐఏం కూటమిగా బరిలోకి దిగితే. కూటమి నాలుగో అభ్యర్థిగా అద్దంకి దయాకర్‌ను నిలబెట్టాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు తెలిసింది. తొలి ప్రాధాన్యం కింద రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్‌రెడ్డికి టికెట్ ఇస్తున్నందున జీవన్‌రెడ్డిని పూర్తిగా పక్కనబెట్టి, నా లుగో అభ్యర్థి అద్దంకి దయాకర్‌ను నిలబెట్టే లా పావులు కదులుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వరకు కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ ఆశావాహులు దాదాపు 40 మంది పేర్లు తెర మీదికొచ్చాయి. కసరత్తుల అనంతరం తాజాగా నాలుగు నుంచి ఐదుగురి పేర్లు మాత్రమే మిగినట్టు తెలుస్తున్నది. ఈ ఐదుగురిలో సీఎం రేంవత్‌రెడ్డి సలహాదారుడు, ఆయన స్నేహితుడు వేంనరేందర్‌రెడ్డి పేరు ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. ఆయన పేరునే ప్రతిపాదించాలని టీపీసీసీ మీద సీఎం ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తున్నది. రెండో అభ్యర్థిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, జీవన్‌రెడ్డి, మాదిగ సామాజికవర్గానికి చెందిన ముగ్గురు నేతల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఎంఐఎంతో పొత్తుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆసక్తి లేనట్టుగా తెలుస్తున్నది. ఏడుగురు ఎమ్మెల్యేల బలమున్న ఏంఐఎం పార్టీ బీఆర్ఎస్తో జత కలిస్తే మొదటికే మోసం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళనతో ఉన్నట్టు సమాచారం.