సంపాదన మంత్రులది.. బాధ్యత మాకా?
ఎమ్మెల్సీ ఎన్నికల సమరం కాంగ్రెస్ పార్టీలోని అనిశ్చితి, అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలను బయటపెడుతున్నది. మంత్రుల శైలితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా చేతులెత్తేశారని, ఎన్నికలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు
- మంత్రులే సంపాదించుకుంటున్నారని గుర్రు
- ఎన్నికల్లో వాళ్లే ఖర్చు పెట్టుకోవాలని డిమాండ్
- నిరుద్యోగులకు ముఖం చూపించలేని స్థితిలో నేతలు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల సమరం కాంగ్రెస్ పార్టీలోని అనిశ్చితి, అంతర్గత విభేదాలు, సమన్వయ లోపాలను బయటపెడుతున్నది. మంత్రుల శైలితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా చేతులెత్తేశారని, ఎన్నికలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. అభ్యర్థుల గెలుపు బాధ్యతను, ఎన్నికల ఖర్చుల భారాన్ని మంత్రులపైకే నెట్టేస్తున్నారని చెప్పుకొంటున్నారు.
పట్టభద్రుల ఎన్నికల్లో పట్టు సాధించాలంటే అర్హులైన ప్రతి విద్యావంతుడినీ ఓటరుగా నమోదు చేయించడమే తొలి అడుగు అని తెలిసినా ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి వెనుకాడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అధికార పక్ష ప్రజాప్రతినిధుల్లో ఈ స్థాయి నిస్తేజం కనిపించడానికి క్షేత్రస్థాయిలో విద్యావంతులు, ఉద్యోగుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటమే ప్రధాన కారణమని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
పట్టభద్రులకు ముఖం చూపలేక
ఉద్యోగులు, నిరుద్యోగులకు ముఖం చూపించే పరిస్థితి లేదని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సన్నిహితుల వద్ద వాపోతున్నారట. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు కాలేదన్న భావన బలంగా నాటుకుపోయిందని చెప్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవటం, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోడంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం గూడుకట్టుకున్నదని అంటున్నారు. అశోక్‌నగర్ మొదలు, గ్రామీణ ప్రాంతాల వరకు నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఈ తరుణంలో వారిని నేరుగా కలిసి ఓట్లు అడగడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు జంకుతున్నారని తెలుస్తున్నది. ఎకడ తమను నిలదీస్తారోనన్న ఆందోళనతోనే ఓటరు నమోదు వైపు కూడా కన్నెత్తి చూడటం లేదని స్పష్టం చేస్తున్నారు.
ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి కూడా కాంగ్రెస్ నాయకులను కలవరపెడుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. నూతన పీఆర్సీ ప్రకటనపై స్పష్టత లేకపోవడం, ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. న్యాయమైన సమస్యల పరిషారం కోసం ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నిసార్లు విన్నవించినా ఆశించిన ఫలితం దకడం లేదు. దీంతో రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తమ నిరసన స్వరాన్ని వినిపించాలని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు వారిని కలువడానికి కూడా సాహసించడం లేదని చెప్తున్నారు. ఇలా కీలకమైన రెండు వర్గాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్న క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక సాహసంగా ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు తెలిసింది.
ఉత్తమ్ మెడమీద కత్తి
ఈ అంతర్గత సంక్షోభం ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల స్థానంలో తీవ్రస్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి తీవ్ర సందిగ్ధంలో పడిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు చెందిన కీలక మంత్రులు ఈ అభ్యర్థి కోసం తాము నయాపైసా ఖర్చు చేయబోమని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరాటాల కారణంగా మంత్రుల మధ్యే సరైన సమన్వయం లేదని అనుకుంటున్నారు.
నిజానికి పోటీ చేయడానికి వ్యక్తిగతంగా పెద్దగా ఆసక్తి లేనప్పటికీ, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఒత్తిడి, మద్దతుతోనే సర్వోత్తమ్‌రెడ్డి బరిలోకి దిగాల్సి వచ్చిందనే చర్చ సాగుతున్నది. మరోవైపు, స్థానిక మంత్రుల నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి పూర్తిగా సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిపైనే ఆధారపడి ప్రచారాన్ని నెట్టుకొస్తున్నారని సమాచారం. మంత్రులు తమ పరిధిలోని వ్యవహారాలకే ప్రాధాన్యమిస్తూ, ఉమ్మడి స్థానాల అభ్యర్థుల గెలుపోటములపై ఆసక్తి చూపకపోవడం పార్టీ శ్రేణులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నది.
ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టం
ఎన్నికల్లో గెలుపు ఓటముల భారం మొత్తం మంత్రులదేనని ఎమ్మెల్యేలు స్పష్టం చేసినట్టు తెలిసింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆర్థికంగా బలపడుతున్నది వారేనని, నిర్ణయాలన్నీ మంత్రులే తీసుకుంటున్నారని, నిధుల కేటాయింపులు వారి చేతుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారట. పైగా అభ్యర్థుల ఎంపిక కూడా వారి కనుసన్నల్లోనే జరిగిందని, కాబట్టి వారిని గెలిపించే బాధ్యత, దానికి అయ్యే సమస్త ఖర్చులూ మంత్రులే భరించాలని తెగేసి చెప్తున్నట్టు తెలిసింది.
తాము ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. అందుకే మద్దతు కోరి నియోజకవర్గాలకు వస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి కేవలం మర్యాదపూర్వక పలుకరింపులు తప్ప నిజమైన రాజకీయ అండ దకడం లేదని చెప్తున్నారు. కనీసం క్యాడర్‌ను రంగంలోకి దించి, ఓటర్లను ఏకం చేసే ప్రయత్నాలు కూడా జరుగడం లేదని సమాచారం. పీసీసీ తరఫున నియోజకవర్గాలకు ఇన్చార్జులను నియమించినా, వారు పర్యటనలతో సరిపెడుతున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో గ్రాడ్యుయేట్లను చేరే కార్యాచరణను అమలు చేయడం లేదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

