Kollapur | కొల్లాపూర్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్లను కొల్లగొడుతుంటే గ్రామాలలోని అధికార పార్టీకి చెందిన గల్లీ లీడర్లు గుట్టలను కొల్లగొడుతున్నారని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండల కేంద్రంలోని ఊర గట్టు వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా అర్ధరాత్రి పూట సహజ వనరులను అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నా.. అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట రాములు, నాగేశ్వర్ రెడ్డిలు పట్టపగలు ఊర గుట్టకు హిటాచి మిషన్లతో గొయ్యి పెడుతున్నా.. మైనింగ్ శాఖ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ శాఖ కానీ తమకు ఎలాంటి సంబంధం లేదు అన్న విధంగా ఉంటున్నాయని గ్రామస్తులు ఆ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. ఊరగుట్టలో వణ్యప్రాణులు ఉన్నాయని రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మట్టిని తరలించడంపై ప్రశ్నించిన అధికార పార్టీ నాయకులు చేయి వేసుకున్నట్లు తెలుస్తుంది. గ్రామంలోని పేదలు ఇందిరమ్మ ఇండ్లకు మట్టిని నింపుకోవాలని గుట్ట వద్ద తట్టెడు మట్టి తీస్తే చట్టాలు గుర్తుకొచ్చి చర్యలు తీసుకునే అధికారులు అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఊరగుట్ట మట్టిని ప్రవేట్ వెంచర్లోకి తరలిస్తున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
ఊరగుట్టను కొల్లగొట్టే అధికార పార్టీకి చెందిన నాయకులకు చట్టాలు చుట్టాలుగా మారాయని ఎద్దేవా చేస్తున్నారు. ప్రైవేట్ వెంచర్లకు మట్టి కొట్టుకోవాలంటే ప్రైవేటు భూముల నుంచి మట్టి తీసుకోవాలి కానీ ప్రభుత్వానికి చెందిన సహజ సిద్ధమైన గుట్టలను విధ్వంసం చేయడం సరైనది కాదని మండల కేంద్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు రోజుల నుంచి ఏకధాటిగా ఊరగట్టును అక్రమార్కులు చదును చేస్తున్నారు. సహజ వనరులను కాపాడాలని ప్రశ్నించిన వారిపై అధికార పార్టీ నాయకులు దాడి చేయడంతో పాటు అధికారం తమదేనని తమ నాయకుడే మంత్రిగా ఉన్నాడని ఏ పోలీస్ స్టేషన్ ఏ అధికారులకు ఫిర్యాదు చేసిన తమనెవరు ఏమి చేయలేరని సహజ వనరులను కొల్లగొట్టడంలో అధికార దర్పం ప్రదర్శిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. అక్రమంగా ఊరగట్టుపై జరుగుతున్న మట్టి తవ్వకాలపై నమస్తే తెలంగాణ ఆర్టీవో బన్సీలాల్ను ఆరా తీయగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.