Congress Leader | మిర్యాలగూడ, నవంబర్ 1: ఎస్టీ మహిళపై కాంగ్రెస్ నాయకుడు లైంగికదాడికి పాల్పడగా, అవమానభారంతో బాధితురాలు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నంచింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామానికి చెందిన ఎస్టీ మహిళ గత నెల 21న రాత్రి ఇంట్లో ఉండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గంటా కృష్ణయ్య ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. మహిళను చంపుతానని బెదిరించి, లైంగికదాడి చేశాడు. బాధితురాలి కేకలతో స్థానికులు రావడంతో కృష్ణయ్య పరారయ్యాడు.
అవమానం తట్టుకోలేక బాధితురాలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బంధువుల ఆమెను సూర్యాపేట ఏరియా దవాఖానకు తరలించారు. అనంతరం హైదరాబాద్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఈ నెల 22న కాంగ్రెస్ నాయకుడు గంటా కృష్ణయ్యపై వేములపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశం తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకపోవడంపై సీఐ వీరబాబును నమస్తే తెలంగాణ వివరణ కోరగా, పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ధరూర్, నవంబర్ 1 : జోగుళాంబ గద్వాల జిల్లా బిజ్వారంలో రాజేశ్వరి ఘటన మరువకముందే మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. ధరూర్ మండలంలోని ఓ గ్రామంలో ఓ బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన యువకుడు లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు రాగా యువకుడు పరారయ్యాడు. ఈ సంఘటన వారం కిందట జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. యువకుడిపై కేసు నమోదు కాకుండా అతడి బంధువు, ఓ ప్రజా సంఘ నేత అనుచరుడు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే స్వగ్రామంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.