మణికొండ, డిసెంబర్ 10: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన సోలార్ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. బుధవారం కాంగ్రెస్ నేత అక్కడ తమ బంధువుల దశదిన కర్మ కార్యక్రమాల నిర్వహణకు వేదికగా మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్ పరిధిలోని మీర్జాగూడ-ఇంద్రారెడ్డి కంచె సమీపంలోని ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న సైక్లింగ్ ట్రాక్‌లో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవీందర్‌గౌడ్ తన పెదనాన్న దశదిన కర్మ, తలనీలాల తొలగింపు, వాటర్ ట్యాంకర్లతో సామూహిక స్నానాలు నిర్వహించారు. సైక్లింగ్ ట్రాక్‌లో కుటుంబ కార్యక్రమం నిర్వహించడంపై సైక్లింగ్ అభిమానులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఇదేంటని ప్రశ్నించగా ‘నేను సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిని… నన్నెవరు ప్రశ్నించేది? అంటూ బదులిచ్చాడు. ఈ వ్యవహారాన్ని కొందరు యువకులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. సైక్లింగ్ ట్రాక్‌లో కర్మకాండలేంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో నగర ఖ్యాతి తీరు ఇదీ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. సీఎంవోతో పాటు ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు పోస్ట్‌ను ట్యాగ్ చేశారు. స్పందించిన స్థానిక పోలీసులు మాజీ సర్పంచ్‌ను మోకిల పోలీస్‌స్టేషన్‌కు పిలిపించినట్టు తెలిసింది. గతంలో ఇదే సైక్లింగ్ ట్రాక్‌లో బర్రెలను తరలిస్తూ వీడియోలు వైరల్‌గా మారాయి.