Congress | కూసుమంచి, అక్టోబర్ 28: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటోంది. ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ టికెట్ ఇస్తారని కష్టపడితే పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి అసమ్మతి గళాన్ని వినిపించారు. పాలేరులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాధవీరెడ్డి మాట్లాడారు. తాను నాలుగు మండలాల్లో తిరిగి పార్టీని ముందుకు తీసుకొని పోయానని అయితే టికెట్ల పంపకాల విషయంలో అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. మహిళా కోటాలో అయినా టికెట్ ఇస్తారని ఆశించామని తెలిపారు.
నాలుగు, ఐదు రోజుల్లో భవిష్యత్ ప్రణాళికను అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలిగా పనిచేశానని పార్టీ ఇచ్చిన ప్రతీ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవడానికి తనవంతుగా పనిచేశానన్నారు. పాలేరులో పుట్టిన నాకు టికెట్ ఇవ్వకపోటానికి కారణాలు చెప్పాలన్నారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంలో ఉన్న నేను ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో పూర్తి బాధ్యతగా పని చేశానన్నారు.