హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ గగ్గోలు పెడతారు. కానీ రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ గెలుపునకు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ను గెలిపించడానికి ఆయన సోదరుడు, కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకుడు కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన ఆడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్-బీజేపీ మధ్య దోస్తీ ఉందని చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు. ఇటీవలే రాజస్థాన్ వీర్తేజా బోర్డు చైర్మన్‌గా సహాయ మంత్రి హోదా పదవి పొందిన ప్రముఖ జాట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రిక్ష్పాల్ సింగ్ మిర్దా తన మేనకోడలు, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ జ్యోతి మిర్దా గెలుపుకోసం పనిచేస్తానంటూ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిక్ష్పాల్ సింగ్‌కు ఆ ప్రాంతంలో పలుకుబడి ఉంది. అతని కుమారుడు విజయపాల్ మిర్ధా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. ఆదివారం తన కార్యాలయంలో రిక్ష్పాల్ సింగ్ మాట్లాడుతూ ‘బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జ్యోతి మిర్దా గెలుపు కోసం పనిచేస్తా’ అని బహిరంగంగా ప్రకటించారు.