రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో తుఫాను ముందటి ప్రశాంతత కనిపిస్తున్నది. ముఖ్యనేత దుందుడుకు వైఖరి ఒకవైపు, అసలు కాంగ్రెస్ నేతల అంతర్మథనం మరోవైపు మోహరించి సమరానికి ముందటి సన్నివేశాన్ని ఆవిష్కరిస్తున్నాయి. పాలమూరులో ముఖ్యమంత్రి రేవంత్, ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రకటించుకోనంత దూకుడుగా ‘పదేండ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని’ అని క్లెయిమ్ చేసుకోవడం తమది జాతీయ పార్టీ అనుకుంటున్న కాంగ్రెస్ నేతలకు ఎంతమాత్రమూ మింగుడుపడటంలేదు. నలభై నిమిషాల ప్రసంగంలో 38 సార్లు కేసీఆర్ జపం చేసిన రేవంత్ పైకి బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు నటించినా ఆయన అసలు సందేశం మాత్రం ‘అసలు కాంగ్రెస్’ నేతలకే అన్నది రాజకీయ పరిశీలకులకు, పార్టీ ముఖ్యులకు స్పష్టమైంది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తున్న మోదీతో సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తూ దాన్ని హైకమాండ్‌ను బ్లాక్మెయిల్ చేయడానికి వాడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ తాజా ప్రకటనతో తనను తప్పించడం సాధ్యం కాదని సవాల్ విసిరినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. మనసులో ఏమున్నా పైకి మౌనం వహిస్తున్న కాంగ్రెస్ నేతలు పిల్లి మెడలో గంట కట్టిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటనపై ఆంతరంగిక సంభాషణల్లో సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకి అయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అనుబంధాన్ని కాపాడుకోవడానికి రేవంత్ తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు మథనపడుతున్నారు.
బాబు కోసం బనకచర్లపై సంతకం పెట్టిన రేవంత్ తెలంగాణలో కాంగ్రెస్‌కు పుట్టగతులులేని పరిస్థితులు కల్పిస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. అందువల్లే బనకచర్లపై సంతకం పెట్టిన నాటినుంచి ఈ అంశంపై అసలు కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా పెదవి విప్పలేదు. ముఖ్యమంత్రి వైఖరికి మద్దతుగా మాట్లాడలేదు. మొహమాటానికైనా ఆయనను సమర్థించే ప్రయత్నం చేయలేదు. బనకచర్ల అనేది రేవంత్ ఎజెండానే తప్ప కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం లేదనడానికి ఇంతకుమించి నిదర్శనం అవసరం లేదని కాంగ్రెస్ ముఖ్యుడొకరు పేర్కొన్నారు. దీనినుంచి పుట్టిన ఫ్రస్ట్రేషన్ ఫలితమే పాలమూరులో రేవంత్ చేసిన ‘పదేండ్ల ముఖ్యమంత్రి నేనే’ అనే ప్రకటనగా భాష్యాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): సాధారణంగా జాతీయ పార్టీల్లో వ్యక్తిగత ఎజెండాలు ఉండవు. ఎమ్మెల్యే అభ్యర్థిని నిలబెట్టాలన్నా, ముఖ్యమంత్రిని నియమించాలన్నా, తొలిగించాలన్నా అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈ సంస్కృతి నరనరాన జీర్ణించుకుపోయింది. అధిష్ఠానం కాదంటే ఎంత బలమైన నేతలైనా గమ్మున కూర్చోవాల్సిందే! ఇందుకు కర్ణాటకలో డీకే శివకుమార్ ఉదంతమే ఉదాహరణ! అలాంటిది రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి మాత్రం రాబోయే పదేండ్లు తానే సీఎంను అని పదే పదే చెప్తున్నారు. రేవంత్‌రెడ్డి వ్యవహారంపై అసలు కాంగ్రెస్ నేతలు రుసరుసలాడుతున్నారు. ఇలా ఏకపక్షంగా ప్రకటించుకోవడం వెనుక కారణం, ఎవరిని చూసుకొని ఆ ధైర్యం అని ఆరా తీస్తున్నారు.
ఇది ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలపై ధిక్కార స్వరమేనని గుసగుసలాడుకుంటున్నారు. ఏడాదిన్నరగా పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవడం, ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తన అభిప్రాయానికి అధిష్ఠానం ప్రాముఖ్యత ఇవ్వకపోవటంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలను ఎదిరించాలని నిర్ణయించుకున్నారా? అధినేత కలవకపోయినా తాను భయపడబోనని అధిష్ఠానానికి బలమైన సంకేతం పంపదలుచుకున్నారా? అని కాంగ్రెస్‌లో చర్చ నడుస్తున్నది. గాంధీ భవన్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
‘కొంత మందికి నా కుర్చీ మీదనే కన్నుంది. నేనో కుర్చీ మీద కూర్చొని.. ఎదురుగా మరో కుర్చీ చూపి కూర్చోమని చెబితే వినరు. నా పకనే కుర్చీ వేసుకొని కూర్చోవాలనో, లేదా నా కుర్చీ మీద ఇంకో కుర్చీ వేసుకొని కూర్చోవాలనో చూస్తున్నారు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలివి! తాజా పరిణామాల నేపథ్యంలో చర్చ మొత్తం ఈ వ్యాఖ్యల చుట్టే తిరుగుతున్నది. పార్టీ అగ్రనేతల ప్రోత్సాహంతో కొందరు సీఎం కుర్చీ మీద కన్నేశారని సీఎం సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. అవకాశం దొరికితే కుర్చీ నుంచి దింపడానికి ఢిల్లీలో పావులు కదుపుతున్నారని అనుమానిస్తున్నాయి. రేవంత్ తప్పిదాలను అధిష్ఠానానికి నివేదిస్తున్నారని సమాచారం.
ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, రాహుల్ తో గ్యాప్ రోజురోజుకూ పెరిగిపోతున్నదన్న ప్రచారం నేపథ్యంలో ఏ నాటికైనా సదరు సీనియర్ నేతలతో ప్రమాదం తప్పదని సీఎం సన్నిహిత వర్గాలు అంచనాకు వచ్చినట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణ సమయంలో ఏకాభిప్రాయం సాధించకుండా ఆ సీనియర్ నేతలు ముప్పుతిప్పలు పెట్టినట్టు సమాచారం. ఏకాభిప్రాయంతో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నాలను ఇద్దరు కీలక నేతలు అడ్డుకున్నారని సీఎం వర్గం భావిస్తున్నది. ఏకాభిప్రాయ సాధన విఫలమై ఢిల్లీలో సీఎంను పలుచన చేయడానికి వారే కారణమని ఆరోపిస్తున్నది. పార్టీ సీనియర్ నేతలు కావడం, గాంధీ కుటుంబానికి వీర విధేయులుగా ముద్ర పడటంతో హైకమాండ్ సదరు నేతలను ప్రోత్సహిస్తున్నదని భావిస్తున్నారట!
గతంలో ఏనాడూ ఇలాంటి పరిణామాలు చూడలేదని సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ‘సీఎం అయితే.. మీరు ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారు?’ అని ఒక విలేకరి అడగగా, ‘మా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరు అనేది అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. వారు నిర్ణయించిన వ్యక్తే ఉచిత విద్యుత్తుపై తొలి సంతకం పెడతారు’ అని చెప్పినట్టు సీనియర్ కాంగ్రెస్ నేత ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.
అదే కాంగ్రెస్ సంప్రదాయమని, దానికి విరుద్ధంగా తానే పదేండ్లు ముఖ్యమంత్రినంటూ రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించుకోవడం కచ్చితంగా పార్టీని ధిక్కరించడమేనని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీలో అంతర్గత కలహాలకు ఆజ్యం పోసినట్టయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిణామాలపై అధిష్ఠానం, రాహుల్ గాంధీ స్పందించకపోతే వలస కాంగ్రెస్ నేతల ప్రాబల్యం పెరిగిపోయే ప్రమాదం ఉన్నదని అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన వర్గానికి మంత్రి పదవులు ఇప్పించుకోవడంలో విఫలమైన ముఖ్యనేత, పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను అధిష్ఠానం ముందు పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు చెందిన ఇద్దరు నేతల వ్యవహారం, వారి ఆర్థిక అవకతవకలు, అవినీతి తదితర వివరాలతో ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం.. రాష్ట్ర నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం, ఎమ్మెల్యేల గ్రూప్ రాజకీయాలు, నేరుగా మంత్రులను టార్గెట్ చూస్తూ విమర్శలు చేయటంపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పూర్తి వివరాలతో ఢిల్లీకి రావాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ వర్గ పోరుపై నివేదికలను రేవంత్‌రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లినట్టు సమాచారం. కానీ రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో రేవంత్‌రెడ్డి తీవ్ర నిరాశ చెందినట్టు తెలిసింది. ఏడాదిన్నరగా జరుగుతున్న అవమానాలు చాలునని, ఇక సహించేది లేదంటూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పదేండ్లపాటు సీఎంనంటూ తనకు తానే ప్రకటించుకోవడం ద్వారా.. అటు పార్టీ అధిష్ఠానానికి, ఇటు భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే అవకాశం ఉన్న ఇతర నేతలకు ఒక గట్టి సందేశం పంపాలని రేవంత్ నిర్ణయించుకున్నట్టు పార్టీ శ్రేణులు విశ్లేషిస్తున్నాయి.