హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగజాతిని కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ నాయకుడు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యయనం చేసి సిఫారసులు చేయడానికి ప్రభుత్వం ఉత్తమ్ నేతృత్వంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎర్రోళ్ల శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేస్తూ అగ్రవర్ణానికి చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కమిటీ చైర్మన్‌గా నియమించడమంటే మరోసారి మాదిగలను దగా చేయడమేనని ధ్వజమెత్తారు.
ఎస్సీ వర్గాల సమస్యలు తెలిసిన నాయకుడిని కాకుండా ఉన్నత వర్గానికి చెందిన ఉత్తమ్‌ని నియమించడంలో మీ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఉత్తమ్ వల్ల మాదిగ జాతికి ఎలా న్యాయం చేకూరుతుందని నిలదీశారు. ఈ కమిటీకి మంత్రి దామోదర రాజనర్సింహను చైర్మన్‌గా నియమించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి దామోదర రాజనర్సింహను కమిటీ చైర్మన్‌గా నియమించాలని, లేదంటే కమిటీనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ మాదిగలను పట్టించుకోలేదని ఎర్రోళ్ల ధ్వజమెత్తారు. కాంగ్రెస్ విధానాలతోనే గతంలో సురేందర్ మాదిగ గాం ధీభవన్‌లో అమరుడయ్యారని గుర్తు చేశారు.