హైదరాబాద్ సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) ‘చెరువులను చెరబడితే చెరసాలకే& జలవనరుల పరిరక్షణకే కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తున్నది. ఆక్రమణదారుల్లో ఎంత గొప్ప మహామహులున్నా విడిచిపెట్టను. చెరువుల ఆక్రమణల విషయంలో ఐరన్ హ్యాండ్‌తో అణిచివేస్తాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు నీటిమూటలే అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నో చెరువులను నివాస ప్రాంతాలుగా మార్చివేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. చెరువుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నదనడానికి హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల భూములను రెసిడెన్షియల్ జోన్లుగా మారుస్తామంటూ నోటిఫికేషన్లు జారీ చేయడమే నిదర్శనం.
ఒకవైపు, చెరువుల పరిరక్షణ పేరిట హైడ్రా బుల్డోజర్లను పేదల ఇండ్లపైకి తీసుకెళ్లిన ప్రభుత్వం మరోవైపు, బఫర్‌జోన్‌లో ఉన్న భూములను నేరుగా రెసిడెన్షియల్ జోన్లుగా మార్చడానికి చర్యలు చేపట్టడం వివాదాస్పదమవుతున్నది. చెరువులను పరిరక్షిస్తున్నామని చెప్పుకునే హెచ్ఎండీఏనే జలవనరులను జనావాసాలుగా మార్చేస్తున్నది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 84లో నవయుగ లిగాల ఎస్టేట్ కంపెనీకి భూమి ఉన్నది. ఇందులో 5,234 మీటర్ల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొన్నది.
ఇదే సర్వే నంబర్లో కొంత భాగం గోపి చెరువు బఫర్ జోన్లో ఉన్నదంటూ హెచ్ఎండీఏ.. లేక్ ఐడీ 3714 పేరిట ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే సర్వే నంబర్ 84లోని కొంత భూమిని ప్లాట్లు, అపార్టుమెంట్లుగా నవయుగ లిగాల ఎస్టేట్ కంపెనీ విక్రయించింది. 84/పీలో ఉన్న 8.15 ఎకరాల్లో కొంతభాగం చెరువు కింది, మరికొంత భాగం బఫర్‌జోన్‌లో ఉండగా… రెసిడెన్షియల్ జోన్లోకి మారుస్తున్నట్టు ప్రకటించింది.
దీనికి సంబంధించి ఈ ఏడాది జనవరి 10న 4901/పీఎల్జీఐ(1)/2024 పేరిట నోటిఫికేషన్ వెలువడింది. దీనిపై తుది ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వానికి హెచ్ఎండీఏ నివేదికను కూడా అందజేసింది. రేపోమాపో జీవో జారీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. హెచ్ఎండీఏ చట్టంలో ఉన్న సెక్షన్-15(3)-2008ను బూచిగా చూపి చెరువులు, బఫర్, ఎఫ్టీఎల్ భూములను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చివేస్తున్నారు. ఈ సెక్షన్ ఆధారంగానే ఇప్పటివరకు శేరిలింగంపల్లి సర్వే నంబర్ 84/పీలో ఉన్న ఉన్న భూమిని ఓ నిర్మాణ సంస్థకు చెందినదిగా తెలిపింది.
ఇప్పటికే గోపీ చెరువు చుట్టూ కాంక్రీట్ జంగిల్‌ను తలపించేలా నిర్మాణాలున్నాయి. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పేరిట కొంచెం భూమిని కూడా విడిచిపెట్టకుండా నిర్మాణ సంస్థ అమ్మకాలు జరుపుతున్నది. ఇప్పుడు బఫర్‌జోన్‌లో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వమే నిర్మాణ సంస్థలకు సహకరించడం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్ 84లో ఇప్పటికే పూర్తి నిర్మాణాలు జరిగిపోగా బఫర్‌జోన్ పరిధిలోని 8.15 ఎకరాల భూమిని రెసిడెన్షియల్ జోన్‌గా మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరం. చెరువులను కాపాడేందుకే హైడ్రాను తీసుకొచ్చామని చెప్తున్న ప్రభుత్వం.. అదే బఫర్‌జోన్ పరిధిలో ఉన్న భూములను రెసిడెన్షియల్ ప్రాంతంగా మార్చే దిశగా అడుగు వేస్తుండటం ఆందోళనకరం.
హెచ్ఎండీఏ డెయిలీ సీరియల్ తరహాలో సాగుతున్న చెరువుల హద్దుల నిర్ధారణ ప్రక్రియపై ఇప్పటికే హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ నగరంలోని చెరువుల హద్దుల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిపై ఎప్పటికప్పుడు తమకు నివేదించాలని హెచ్ఎండీఏను ఆదేశించింది. హెచ్ఎండీఏ ఒకవైపు హైకోర్టుకు నివేదికలు అందజేస్తూనే, మరోవైపు చెరువు భూములను రెసిడెన్షియల్ ప్రాంతాలుగా మార్చివేస్తున్నది.
నగర శివారుల్లో ఉన్న చెరువుల్లోనూ ఆక్రమణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎఫ్టీఎల్ భూముల్లోనూ రియల్ఎస్టేట్ వ్యాపారులు భారీ నిర్మాణాలు చేపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆయా చెరువుల పరివాహక ప్రాంతాల్లో వెలసిన నిర్మాణ కార్యకలాపాలను నియంత్రించేలా చెరువుకు సుమారు 20-30 మీటర్ల దూరంలో ఉన్న భూములను బఫర్‌జోన్‌గా నిర్ధారించింది. మెజార్టీ చెరువుల్లో ఆక్రమణలు ఉన్నాయని, ఇటీవల హైడ్రా, ఎన్ఆర్ఎస్సీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
తాజాగా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి గ్రామ సర్వే నంబర్లోని 175, 171లో పది ఎకరాల భూమిలో కొంతభాగం అంబీర్ చెరువు విషయంలో… ట్యాంక్బెడ్, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ భూములను రెగ్యులరైజ్ చేసే అధికారం ప్రభుత్వానికి కూడా లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కానీ అధికారులు మాత్రం చెరువులు, కుంటలను నిర్వీర్యం చేసేలా ఆ భూములను రెసిడెన్షియల్, మల్టీపర్పస్ భూములుగా మారుస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.