హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): దసరా వస్తున్నదంటే ప్రజలంతా కొత్తకొత్త ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్లో స్పెషల్ ధమాకా పేరిట ధరలు తగ్గుతాయన్న ఆశతో వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో దసరాకు శుభవార్తలు చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులను పండుగ పూట దగా చేసే దురాలోచనతో ముందుకొచ్చింది. కొత్త వాహనాల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గిందనే ఆనందాన్ని.. అది అమల్లోకి రాకముందే ఆవిరి చేసింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్రం కొంత రిలీఫ్ ఇచ్చినా.. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఆ అవకాశం ప్రజలకు లేకుండా చేసింది. డబ్బుల కోసం పట్టి పీడించేందుకు అత్యంత రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. తెలంగాణలో ఇక నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సెస్సును తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ‘రోడ్డు భద్రతా సెస్సు’ పేరిట రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలను జలగల్లా పట్టి పీడించేందుకు సర్కారు సిద్ధమైంది. వారిపై ఆర్థిక యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే లైఫ్‌ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీలతో సామాన్యులు సతమతమవుతుండగా ఫ్యాన్సీ నంబర్ల ధరలనూ అమాంతం పెంచింది. కేంద్రం తెచ్చిన హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ)ను తెలంగాణలో అమలు చేయిస్తూ బలవంతంగా కోట్ల రూపాయలు దండుకుంటున్నది. ఈ క్రమంలో రోడ్డు భద్రతా సెస్సుతో ఏటా రూ.270 కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది.
ఏటా ఇదే లూటీ
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ఈ ప్రతిపాదనలు.. బిల్లు రూపం దాల్చి, అసెంబ్లీలోకి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల వల్ల ఆర్టీఏకు భారీగా ఆదాయం తగ్గుతూ వస్తున్నది. ఇటీవల ప్రభుత్వ పెద్దలు సైతం ఆర్టీసీ, ఆర్టీఏ, ఎక్సైజ్ ఆదాయాలు తగ్గడంపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీఏ అధికారులకు రోడ్డు భద్రతపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ ఆదేశాలు గుర్తుకొచ్చాయి. అందులో భాగంగానే ‘రోడ్డు భద్రతా సెస్సు’కు ప్రతిపాదనలు సిద్ధం చేసి, మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లడంతో వారు కూడా ఓకే చెప్పేశారు. కాగా, కొత్త వాహనాల సమయంలో వసూలు చేసే సెస్సు డబ్బును రవాణాశాఖ కమిషనర్ ఆపరేట్ చేసేలా ప్రత్యేక ఖాతాను తెరుస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ఇలా వసూలు చేసే సొమ్ముతో సెమినార్లు, వర్క్‌షాపులు, డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు, ట్రాఫిక్ ఎడ్యుకేషనల్ పార్కులు, భారీ వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు, స్పీడ్ లేజర్ గన్లు, బ్రీత్ అనలైజర్లు, ఇతర ఎన్ఫోర్స్మెంట్ పరికరాలను కొనుగోలు చేస్తామని చెప్తున్నది. కేవలం వీటికే ఏటా రూ.270 కోట్ల ఖర్చు చేస్తారా? అనేది ప్రశ్నగా మారింది. దీనికి మాత్రం ప్రభుత్వం నుంచి, రవాణాశాఖ నుంచి సమాధానం లేదు.
ఒక్కో వాహనంపై 2-10 వేలు
కేంద్రం జీఎస్టీ స్లాబులను సవరించిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ సడలింపు ఊరట లేకుండానే రహస్యంగా మంత్రివర్గంతో చర్చించింది. ప్రతిపాదనలు సిద్ధం చేసి వెనువెంటనే ఆమోదించింది. ఆ బిల్లును కూడా అసెంబ్లీలో పాస్ చేయించి రోడ్డు భద్రతా సెస్సు ను ప్రజలపై మోపనున్నది. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందితే బైక్ కొనుగోలుదారులకు రూ.2వేలు, కార్లు, తేలికపాటి వాహనాలు కొనుగోలు చేసేవారి నుంచి రూ.5 వేలు, ఇతర భారీ వాహనాలు కొనుగోలు చేసే వారి నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేయనున్నారు. ఏటా సగటున 9 లక్షలకు పైగా వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. అత్యధికంగా ద్విచక్ర వాహనాలే 6 లక్షల వరకు ఉంటున్నాయి. ఆ తర్వాత లక్షన్నర వరకూ కార్లు ఇతర వాహనాలు ఉంటున్నాయి. మన దగ్గర రిజిస్టర్ అయ్యే కొత్త వాహనాలను బట్టి ఈ మొత్తం విలువ రూ.270 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.