Sitarama Lift | జయశంకర్ భూపాలపల్లి. ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వివక్ష కొనసాగుతున్నది. తెలంగాణలో కేసీఆర్ మూలాలను చెరిపేసే కుట్రలు జరుగుతున్నాయనడానికి ప్రాజెక్టులే నిదర్శనం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును 15 నెలలుగా పక్కనబెట్టారు. ఎన్డీఎస్ఏ, విచారణ కమిటీల పేరుతో ఈ ప్రభు త్వం ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 70% పనులు పూర్తిచేసిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టునూ ఇప్పటికీ పూర్తిచేయనేలేదు.
డీబీఎం 38 కాల్వ ద్వారా చుక్క నీరివ్వలేదు. చివరికి బీఆర్ఎస్ హయాంలో 70% పనులు పూర్తయిన సీతారామ ప్రాజెక్టునూ పక్కన పెట్టేశారు. 15 నెలల కాలంలో పైసా పని చేయలేదు. కనీసం విద్యుత్తు సౌకర్యం కల్పిస్తే నిర్మించిన పైపులైన్ల వరకైనా సాగునీరు అందేది. సుమారు 2,000 ఎకరాలు సాగులోకి వచ్చేవి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు 15 నెలల కాలంలో మూడో పంటనూ నష్టపోయారు. ఈ ప్రాజెక్టు పైపులైన్ పనులు పూర్తిచేస్తే 5 వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. కనీసం సీతారామ ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదంటే, రేవంత్ ప్రభుత్వానికి ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధి అవగతం అవుతున్నది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం గొల్లబుద్దారం సమీపంలో భీంగణపూర్ రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ ప్రభుత్వం 2020లో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మెట్ట భూములను సాగులోకి తేవాలనే లక్ష్యంతో రూ.64 కోట్లతో కేసీఆర్ సర్కారు ఈ ప్రాజెక్టును మొదలుపెట్టింది. పంప్‌హౌస్, సబ్‌స్టేషన్, 14 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మాణం చేపట్టి గండికామారం, గొల్లబుద్దారం, దూదేకులపల్లి, దీక్షకుంట గ్రామాల రైతులకు సాగునీరు అందించాల్సి ఉన్నది. పంప్‌హౌస్, సబ్‌స్టేషన్ నిర్మాణంతోపాటు 9 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మాణ పనులను ఆనాడే పూర్తిచేశారు.
పంప్‌హౌస్ సమీపంలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసేందుకు నాలుగు 240 హెచ్‌పీ మోటార్లు, మూడు 170 హెచ్‌పీ మోటర్లను ఏర్పాటుచేశారు. మరో 5 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ నిర్మాణం జరపాల్సి ఉన్నది. అక్కడ అటవీ భూములు ఉండటంతో అటవీశాఖ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో పనుల్లో జాప్యం ఏర్పడింది. చివరికి అప్పటి కలెక్టర్ భవేశ్‌మిశ్రా అటవీశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అప్పటికే ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో సీతారామ ప్రాజెక్టును పట్టించుకునే దిక్కు లేకుండాపోయింది.
సీతారామ ప్రాజెక్టులో 5 కిలోమీటర్ల పెం డింగ్ పనులు పూర్తిచేసి, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తే 5 వేల ఎకరాల భూములు సాగులోకి వస్తాయి. భీంగణపూర్ రిజర్వాయర్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే మెట్ట భూములకు సాగునీరు అందుతుందని భావించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ సీతారామ ప్రాజెక్టు నిర్మించింది. రూ.6 కోట్లు వెచ్చించి పైపులైన్, విద్యుత్తు సౌకర్యం కల్పిస్తే రైతులకు ఇప్పటికీ మూడు పంటలు పండేవి. కనీసం విద్యుత్తు సౌకర్యం కల్పించినా 9 కిలోమీటర్ల మేర ఉన్న పైపులైన్ ద్వారా సుమారు 2 వేల ఎకరాలు సత్వరమే సాగులోకి వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయమై నోరు మెదపకపోవడం రైతులకు శాపంగా మారింది.
టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి ఆలోచన చేసి ఈ ప్రాజెక్టు కట్టింది. 9 కిలోమీటర్లు పైపులైన్లు నిర్మించారు. అప్పుడు ఫారెస్టు అధికారుల మూలంగా పనులు ఆగినయ్. లేకు ంటే ఎప్పుడో పనులు పూర్తయ్యేది. భూములన్నీ సాగులోకి వచ్చేవి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కనీసం కరెంటు కనెక్షన్ ఇప్పించినా నీళ్లొచ్చేవి. మూడు పంటలు నష్టపోయేవాళ్లు కాదు. నీళ్లు లేక అరిగోస పడుతున్నం. కనీసం కరెంట్ కనెక్షన్ ఇప్పించి రైతులను ఆదుకోవాలి.
– భూక్యా గోపీనాయక్, గొల్లబుద్దారం