హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘ఇప్పుడొక డీఏ ఇస్తున్నాం. ఆరు నెలల్లో మరో డీఏ ఇస్తాం. ఈసారి మాట తప్పం. ఇదిగో జీవో’ అంటూ సర్కారు గత జూన్‌లో ఉత్తర్వులిచ్చింది. సీన్ కట్‌చేస్తే ఆరు నెలలు అంటే డిసెంబర్ 13వ తేదీతో (శనివారం)తో ఈ గడువు ముగిసింది. అయినా ప్రభుత్వోద్యోగులకు మూడో డీఏ ముచ్చటే లేకుండాపోయింది. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏను ప్రభుత్వం గత జూన్‌లో విడుదల చేసింది. 2023 జనవరి 1న చెల్లించాల్సిన డీ ఏను, జూన్ 13న విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. 2023 జూలైలో మరో డీఏ ఇవ్వాల్సి ఉండగా, ఈ డీఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆరు నెలలు గడిచినా.. మూడో డీఏను విడుదల చేయడం మరిచింది.
ఇచ్చింది రెండు.. ఇవ్వాల్సింది ఆరు..
కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డీఏలను విడుదల చేస్తున్నది. వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డీఏలను విడుదల చేయాలి. కానీ కాంగ్రెస్ సర్కారు డీఏల మీద డీఏలు బాకీపడుతున్నది. అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి కార్యాచరణ ప్రకటిస్తే దిగివచ్చిన సర్కారు ఎట్టకేలకు ఒకే ఒక్క డీఏ విడుదలకు పచ్చజెండా ఊ పింది. మొన్నటికి మొన్న సమరం చేస్తామంటే జూన్‌లో రెండో డీఏను విడుదల చేసింది.
ఆరువేల కోట్లకు పైగానే..
రాష్ట్రంలో మొత్తంగా 3.6 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, మరో 2.9 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) విడుదల చేయాలి. ఒక డీఏ విలువ వెయ్యి కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలంటున్నారు. వచ్చే జనవరితో పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఒక డీఏ వెయ్యి కోట్ల లెక్కన ఆరు డీఏ బకాయిల విలువ ఆరువేల కోట్లవుతుంది. 2023 జూలై 1 డీఏను డిసెంబర్లో విడుదల చేశారనుకుంటే.. డిసెంబర్ నుంచి డీఏతో పాటు 2023 జూలై 1నుంచి ఎరియర్స్‌ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు డీఏలు, ఎరియర్స్ మొత్తం కలిపితే సర్కారు రూ. 9వేల కోట్లు బకాయి ఉన్నదని ఉద్యోగ నేతలంటున్నారు.
జీవోను అమలుచేయాలి
ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏలను విడుదల చేస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. 2023 జూలై 1 నుంచి 2025 జూలై 1 వరకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 జనవరి 1నాటికి పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరుతుంది. డిసెంబర్ 8లోపే పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని మేం డిమాండ్ చేశాం. ఆరు నెలల్లో (డిసెంబర్)లో మరో డీఏ విడుదల చేస్తామని సాక్షాత్తు ప్రభుత్వమే జీవోను జారీచేసింది. కానీ ఆరు నెలలు పూర్తయినా డీఏ విడుదల చేయకపోవడం గర్హనీయం. ఇచ్చిన జీవో మేరకు పెండింగ్ డీఏను విడుదల చేయాలి.
– మారం జగదీశ్వర్,ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
మళ్లీ ఐదు డీఏలు బాకీ