హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆంధ్రా నేతల మంత్రాంగంతో మరణానంతరం ప్రజా గాయకుడు గద్దర్‌కు తీవ్ర అవమానం జరిగిందనే ఆవేదన వ్యక్తమవుతున్నది. గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. గద్దర్ ఫొటో, ఆయనకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండానే అవార్డుల మెమోంటోను డిజైన్ చేసిందనే విమర్శలొస్తున్నాయి. ఆంధ్రా సినీపెద్దల లాబీయింగ్‌కు తలొగ్గిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీ నర్సింగరావు కమిటీ సూచనలకు విరుద్ధంగా అవార్డు జ్ఞాపికలో గద్దర్ ఫొటోను తీసేసిందనే విమర్శలొస్తున్న నేపథ్యంలో.. ఆహ్వానపత్రికలపై సైతం గద్దర్ చిత్రం లేకుండా ముద్రించడం మరింత వివాదాస్పదమైంది. శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సం జరుగనున్నది. అవార్డుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను ప్రభుత్వం విడుదల చేసింది. చేతికి రీల్ చుట్టుకున్నట్టుగా, చేతివేళ్ల సపోర్టుతో బొటనవేలు మధ్యన డప్పు పట్టుకున్నట్టుగా జ్ఞాపికను రూపొందించారు.
ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. గద్దర్‌కు గుర్తింపుగా డప్పును ముద్రించినట్టు ప్రభుత్వం చెప్తున్నది. నిజానికి, గద్దర్ అనగానే గుర్తుకువచ్చేది గోచీ, గొంగడి, చేతికర్ర మాత్రమే! గోచీ పోసుకొని, భుజాన గొంగడితో ఎడమ అరచేతిని అడ్డంగా కొద్దిగా పైకెత్తి, కుడిచేతిలో లాల్-నీల్ జెండా కర్రపట్టుకొని సొంపుగా నర్తించే ఆహార్యమే గద్దర్ ట్రెండ్! అవార్డుల మెమోంటోలో ఈ ఆహార్యంతో కూడిన గద్దర్ బొమ్మ ఉంటుందని ఆయన అభిమానులు ఆశించారు. గద్దర్ అవార్డుల కోసం తెలంగాణ ప్రభుత్వం నియమించిన నర్సింగరావు కమిటీ కూడా జ్ఞాపికలో ఇదే ఆహార్యంతో కూడిన గద్దర్ బొమ్మ పెట్టాలని, గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులుగా నామకరణం చేయాలని సూచించింది. కమిటీ సూచనలను తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని అవార్డు జ్యూరీ సభ్యులు చెప్తున్నారు.
ఆంధ్రా సినీ ప్రముఖుల అయిష్టత!
గద్దర్ పేరిట అవార్డులు స్వీకరించడానికి ఇష్టపడని ఆంధ్రా సినీ ప్రముఖులు చాలాకాలం అవార్డుల ఎంపిక ప్రక్రియకు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ ఒత్తిడితో అవార్డులు తీసుకోక తప్పని పరిస్థితులు ఏర్పడి, బలవంతంగా అవార్డుల ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు అవార్డుల పేరు, జ్ఞాపిక డిజైన్‌పై పేచీ పెట్టినట్టు సమాచారం. ‘గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు’ అనే పేరులో మార్పును సూచిస్తూ..‘ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు’ అని పేరు పెట్టాలని సూచించినట్టు తెలిసింది. అవార్డు జ్ఞాపికలో గద్దర్ బొమ్మ ఉండవద్దనే షరతు పెట్టినట్టు సమాచారం. ఆంధ్రా సినీ ప్రముఖుల అభ్యంతరంపై తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వారు ఆంధ్రా సినిమా వాళ్లకు చెప్పినట్టు సమాచారం.
చంద్రబాబు మంత్రాంగం!
సినీ పరిశ్రమపై గుత్తాధిపత్యం ఉన్న ఆంధ్ర ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రిని ఆశ్రయించి, మంత్రాంగం నడిపినట్టు టాలీవుడ్లో ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వ ఆలోచనల్లో మార్పు వచ్చిందని, చేతికి రీల్ చుట్టుకున్నట్టుగా ఉండి, పైన చేతివేళ్ల మధ్య తెలంగాణ సామాజిక, సాంస్కృతికకు ఆహార్యం ప్రకటించేవిధంగా ఉండే గద్దర్ బొమ్మ తొలగిపోయి, డప్పు పట్టుకున్నట్టుగా జ్ఞాపిక రూపుదిద్దుకున్నదని తెలంగాణ సినీవర్గాలు చెప్తున్నాయి. వారి లాబీయింగ్‌తో ఆహ్వానపత్రిక కూడా గద్దర్ ఫొటో లేకుండానే ప్రభుత్వం ముద్రించి పంపిణీ చేసిందని తెలంగాణ సినీవర్గాలు అంటున్నాయి. గద్దర్ అవార్డుల ఆహ్వానపత్రికలో గద్దర్ ఫొటో పెట్టకుండా కేవలం అవార్డు చిహ్నం ఫొటోను మాత్రమే ముద్రించారు.
గద్దర్‌ను అవమానించడమే : ఎమ్మెల్సీ కవిత
గద్దర్ సినీ అవార్డుల ఆహ్వానపత్రికలో గద్దర్ ఫొటో లేకపోవడం బాధాకరమని, ఈ చర్య ప్రజా గాయకుడు గద్దర్‌ను అవమానించడమేనని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సందర్భంలో గద్దర్ పేరును జపం చేసే కాంగ్రెస్ సరార్.. ఆయన పేరు మీద ఇస్తున్న సినీ అవార్డుల ఆహ్వానపత్రికలో గద్దర్ ఫొటో పెట్టకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కనీసం అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనైనా గద్దర్ చిత్రపటాన్ని పెట్టి వారిని గౌరవించాలని సూచించారు.