హైదరాబాద్ సిటీబ్యూరో/బంజారాహిల్స్, జూలై 25 (నమస్తే తెలంగాణ): భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పిలిచే పెద్దమ్మ తల్లికే కష్టం వచ్చింది. తన అభయహస్తంతో ధైర్యం నింపే దేవతకే నిలువనీడ లేకుండా పోయింది. ‘గుడిని, గుడిలోని మూల విరాట్టును సైతం మింగేస్తారు’ అనే నానుడి అక్షరాలా నిజమైంది. గుడిని కూల్చేయడమే కాదు..అమ్మవారి విగ్రహాన్ని కూడా తరలించేశారు. ఈ వికృత క్రీడ నడిపింది ఏ కబ్జాదారుడో, అక్రమార్కుడో కాదు.. సాక్షాత్తూ ప్రభుత్వమే అమ్మవారి ఆలయాన్ని నేలమట్టం చేసింది. మూడు దశాబ్దాలుగా పూజలందుకుంటున్న మూల విరాట్టును మాయంచేసింది.
ఇది ఎవరూ పట్టించుకోని, ఏ మారుమూల ప్రాంతంలోనో జరిగిందనుకుంటే పెద్ద పొరబాటే. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఎమ్మెల్యే కాలనీలో ఈ దారుణం జరిగింది. నిత్యం ధూపదీప నైవేద్యంతో కళకళలాడే ఆలయప్రాంతంలో ఇప్పుడు నైరాశ్యం ఆవరించింది. గుడిగంటలు మోగాల్సిన చోట నిశబ్దం అలుముకున్నది. గుడి వెనుక ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిని ‘హస్త’గతం చేసుకునేందుకు జరిగిన కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని విశ్వసనీయవర్గాల సమాచారం. అధికార పార్టీ నేతల భూ దాహానికి మొన్న కంచ గచ్చిబౌలిలో ప్రకృతి ధ్వంసం కాగా, ఇప్పుడు నిత్యం జయజయధ్వానాలు వినిపించే ఆలయంపైకి జేసీబీలు వెళ్లాయి.
షేక్‌పేట మండలం హకీంపేట గ్రామ పరిధి సర్వేనంబర్ 102/1లోని టీఎస్1/పి, 3/పీ, బ్లాక్-జే, వార్డు 12లో సుమారు-12ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నది. ఇది బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్12లోని ఎమ్మెల్యే కాలనీని అనుకుని ఉంటుంది. ఈ భూమిలో సుమారు 200 గజాల విస్తీర్ణంలో పెద్దమ్మ తల్లి ఆలయం ఉన్నది. 30 ఏండ్ల నుంచి ఎన్బీటీనగర్కు చెందిన బస్తీవాసులు ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఆషాఢ, శ్రావణమాసాల్లో బోనాలు సమర్పిస్తుంటారు.
ఈ క్రమంలో పదిరోజుల కిందట ఆలయాన్ని విస్తరించేందుకు శ్లాబ్వేశారు. సమాచారం అందుకున్న షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది మూడురోజుల కిందట వచ్చి ఆలయాన్ని కూల్చేశారు. అమ్మవారి విగ్రహాన్ని వేరే చోటుకు తరలించారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల సమక్షంలోనే జరిగింది. ఆలయాన్ని కూల్చడం ఏంటని భక్తులు ప్రశ్నించినా, ఆందోళనకు దిగినా అధికారులు పట్టించుకోలేదు.
ఆలయం కూల్చివేత వెనుక అసలు కథ వేరే అనే చర్చ మొదలైంది. పెద్దమ్మ ఆలయం ఉన్న 12 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దల కన్ను పడినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. భూమిని హస్తగతం చేసుకునేందుకు రెండు మార్గాలు ఆలోచిస్తున్నట్టు వెల్లడించాయి. నిధుల సమీకరణ పేరుతో ప్రభుత్వం ఈ భూమిని విక్రయించేలా చేసి, తాము చేజిక్కించుకోవాలని చూస్తున్నారట. లేదంటే కొద్దికొద్దిగా ఆ భూమిని ఆక్రమించాలని బడా బాబులు ప్లాన్ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
12 ఎకరాల స్థలం మధ్యలో ఆలయం ఉండడంతో గుడికి వెళ్లేందుకు దారి వదిలితే సుమారు ఎకరం స్థలం దాకా కోల్పోవాల్సి వస్తుందని లెక్కగట్టారట. పైగా ఆలయం ఉండగా ఆ భూమిని అమ్మినా, కబ్జా చేసినా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని విశ్లేషించినట్టు సమాచారం. దీంతో ఏకంగా గుడిని మాయం చేసేలా, కూల్చివేతలకు కుట్ర పన్నినట్టు ఆరోపిస్తున్నారు. ఈ భూమి విలువ రూ.1200 కోట్లకుపైగా ఉంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తున్నారు.
అధికార పార్టీ భూ దాహానికి హద్దులు లేవని తాజా ఘటన రుజువు చేస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల కంచ గచ్చిబౌలిలో జరిగిన ఘటనను, ఇప్పుడు ఆలయం కూల్చివేతను ఉదహరిస్తూ ‘అడ్డం వస్తే అడవులే కాదు, అమ్మవారి ఆలయమైనా వదిలేది లేదు’ అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. పెద్దమ్మ జోలికొచ్చిన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని మహిళలు శాపనార్థాలు పెడుతున్నారు.
బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ ఆలయం (ఫైల్)
ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అంటూ ఏర్పాటు చేసిన బోర్డు