కామారెడ్డి, జూన్ 12: కామారెడ్డిలో అక్రమంగా నిర్మించిన ఓ హోటల్ కూల్చివేత కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. అక్రమ నిర్మాణాలన్నింటిపైనా చర్యలు చేపట్టకుండా కేవలం ఒకే ఒక్క నిర్మాణాన్ని కూల్చడంపై స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ నేతలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. ముందుగా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. అసలేం జరిగిందంటే.. కామారెడ్డి హౌసింగ్‌బోర్డు కాలనీలో అక్రమంగా నిర్మించిన వసుధ హోటల్‌ను మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు. కేవలం ఒక్క నిర్మాణాన్నే కూల్చి మిగతా వాటిని వదిలేయడంపై ఎమ్మెల్యే కాటిపల్లి, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మున్సిపల్ ఆఫీసుకు వచ్చి కమిషనర్ సుజాతను నిలదీశారు. రాజకీయ కక్షతోనే ఇలా చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల అక్రమ కట్టడాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. అక్కడి నుంచే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఫోన్ చేసిన కాటిపల్లి.. ప్రజల నిర్మాణాలను కూల్చాలని ఆదేశించారా? అని ప్రశ్నించగా.. తానేమీ చెప్పలేదని ఆయన సమాధానమిచ్చారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం మొదలై దూషణల వరకు వెళ్లింది. ఎమ్మెల్యే తమ కౌన్సిలర్లకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే కాటిపల్లికి, కాంగ్రెస్ కౌన్సిలర్ పాత కృష్ణమూర్తి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అక్రమంగా నిర్మించిన వసుధ హోటల్‌ను కూల్చివేయడాన్ని ఎమ్మెల్యే అడ్డుకోవడం సరికాదని కృష్ణమూర్తి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఇచ్చిన నోటీసుల ప్రకారమే అధికారులు కూల్చివేతలు చేపట్టారని, అప్పుడు నోటీసులు ఇచ్చి ఇప్పుడు వద్దనడం సరికాదని పేర్కొన్నారు.