హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): క్రైస్తవ సోదరుల సమావేశమని పిలిస్తే వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత దొంగతనంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా డిక్లరేషన్ అని ప్రకటించారని పలువురు క్రిస్టియన్ బిషప్‌లు, పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ అమృతవాణి సమీపంలోని భారత క్రిస్టియన్ కౌన్సిల్ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు. క్రిస్టియన్ కౌన్సిల్ సమావేశం ఉన్నదని పిలిస్తే వచ్చామని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు అన్ని పార్టీల నాయకులు వస్తారని, మన సమస్యలపై చర్చిద్దామని చెప్పారని తెలిపారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ డిక్లరేషన్ అని చెప్పుకోవడం సరికాదని మండిపడ్డారు. క్రైస్తవుల సమస్యలను కాంగ్రెస్ ఏనాడైనా పట్టించుకున్నదా? అని నిలదీశారు.
అసత్య సమాచారంతో, మనసులో తప్పుడు ఉద్దేశంతో క్రైస్తవ మతపెద్దలను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా పెద్దఎత్తున క్రైస్తవులతో భారీ సమావేశం ఏర్పాటుచేస్తామని బిషప్ భాస్కర్ ములకల తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో భారత క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్, బిషప్ భాస్కర్ ములకల, క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ప్రెసిడెంట్ జెరుసలేం మత్తయ్య, తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ఏనుగుల కరుణాకర్, తెలంగాణ బిషప్స్ ఫెడరేషన్ కన్వీనర్, బిషప్ స్వామిదాసు, క్రిస్టియన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీ సెక్రటరీ మేడం కోమలి, బీఆర్ఎస్ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యురాలు విద్యా స్రవంతి, పాస్టర్ ఎమ్ మోహన్‌బాబు, క్యాథలిక్ లీడర్ రాయిడన్ రోచ్, బిషప్ గొల్లపల్లి జాన్, రెవ ప్రసాద్ దరి, షమ్మ జోయెల్ తదితరులు పాల్గొన్నారు.