Gandipet Lake | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఉస్మాన్‌సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యంపై ఆది నుంచి గందరగోళం కొనసాగుతుంది. జలమండలి రికార్డుల్లోనే 1792 అడుగుల ఎఫ్టీఎల్, 1790 అడుగుల ఎఫ్టీఎల్ ఉంది. ఈ మేరకు నిర్ధారణ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. ఇదేమంటే… 1970 దశకంలో హైదరాబాద్ నగర తాగునీటికి జంట జలాశయాలు మాత్రమే శరణ్యమైనందున ఎక్కువ నీటి కోసం 1792 అడుగుల వరకు నీటిని నిల్వ చేసేవారు. అందుకు అనుగుణంగా గతంలో ఎఫ్టీఎల్ నిర్ధారణ కూడా జరిగింది.
అంటే ఆ రెండు అడుగుల్లో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. అంటే అదే స్థాయిలో నిర్మాణాలూ ఉన్నాయి. అయితే కాలానుగుణంగా మంజీరా, కృష్ణా, గోదావరి జలాలు వచ్చాక అవసరాలు తగ్గి 1790 ఎఫ్టీఎల్ను కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఒకసారి ఎఫ్టీఎల్ను నిర్వహించిన తర్వాత దానిని తగ్గించడమేంది? అనేది నిపుణుల విస్మయం. నీటిని నిల్వ చేసుకోకపోవచ్చుగానీ ఎఫ్టీఎల్ను రికార్డుపరంగా తగ్గించడమేందని వారు ప్రశ్నిస్తున్నారు.
జలమండలి అధికారులు చెబుతున్న కారణాన్ని ప్రామాణికంగా తీసుకుంటే… జంట జలాశయాల నుంచి అవసరం తగ్గినందున ఎఫ్టీఎల్ కుదించారనుకుంటే అసలు ఆ రెండు జలాశయాలు లేకున్నా ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరతాయి. అలాంటప్పుడు అసలు ఎఫ్టీఎల్ పరిధి అవసరమా? అనేది నిపుణుల సూటి ప్రశ్న. చారిత్రక జలాశయాలను ఇంకా పది కాలాలు కాపాడాల్సిన బాధ్యత జలమండలిపైనే ఉంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్ నుంచి ఐదు టీఎంసీల గోదావరిజలాలను జంట జలాశయాలకు తరలించేందుకు కొన్నిరోజుల కిందటనే వేల కోట్లతో తాగునీటి పథకానికి పాలనా ఆమోదం కూడా ఇచ్చింది. దీంతో జలాశయాల్లో పుష్కలంగా గోదావరిజలాలను నిల్వ చేసుకునే వీలుంటుంది. అయినా అధికారులు 1790 అడుగులను ప్రామాణికంగా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
జంట జలాశయాల ఎఫ్టీఎల్ నిర్ధారణ అనేది ఓ బ్రహ్మ పదార్ధం. జలమండలి దశాబ్దాల నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రెండు జలాశయాల పరిరక్షణ వ్యవహారం అనేది సుప్రీం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. ఆ సందర్భంగా జలాశయాల పరిరక్షణకు జలమండలి చాంతాడంత ప్రణాళిక రూపొందించుకొని సుప్రీం కోర్టుకు సమర్పించింది. అందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌తో పరివాహక పరిరక్షణకు ప్రత్యేక స్వాడ్స్‌ను ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాల నివారణతో పాటు నిర్మాణ వ్యర్ధాలను అందులో పడబోయకుండా ఉండేందుకు 24 గంటల నిఘా ఉండేలా బృందాలను ఏర్పాటు చేశారు.
వీటి కోసం ఏటా కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్ల శని! అన్నట్లు అధికార యంత్రాంగం సాక్షిగానే ఏటా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు మాత్రమే కాకుండా ఏకంగా విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు, రెస్టారెంట్లు, పబ్‌లు కూడా వెలిశాయి. దీంతో దశాబ్దాల కిందట జలమండలి అధికారులు అమర్చిన ఎఫ్టీఎల్ రాళ్లు కొన్ని నడక నేర్చి ముందుకు జరిగితే, చాలా వరకు జల సమాధి అయ్యాయి. ప్రస్తుతం రెండు జలాశయాల పరిధుల్లో పట్టుమని పది హద్దు రాళ్లు కూడా కంటికి కనిపించవు.
శాటిలైట్ ఇమేజ్‌ల ఆధారంగా ఎఫ్టీఎస్, బఫర్‌లోని ప్రతి నిర్మాణాన్ని చూడాలని, అవసరమైతే రంగనాథ్‌తో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ హితవు పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వీ6 వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కీ, పట్నం మహేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి నాయకుల అక్రమ కట్టడాలు నేలమట్టం చేసి, ఆ తర్వాత సామాన్యుల మీద పడాలని స్పష్టంచేశారు.
అసలు గండిపేట జలాశయం ఫుల్ట్యాంక్ లెవెల్ ఎంత? జలమండలి లెక్కల ప్రకారమే ఒక మ్యాప్‌లో 1792 అడుగులు అని పేర్కొనగా.. మరొక మ్యాప్‌లో 1790 అడుగులు అని తెలిపింది. అదేమంటే ఎఫ్టీఎల్ను తగ్గించినట్టు జలమండలి చెప్తున్నది. ఎందుకంటే నగరానికి తాగునీళ్ల కోసం ఇతర వనరులు అందుబాటులోకి వచ్చినందున ఎఫ్టీఎల్ను రెండు అడుగులు తగ్గించినట్టు దాని వివరణ.
రెండు అడుగులు తగ్గించడమంటే ఎఫ్టీఎల్కి బఫర్కు మధ్యన విశాలమైన భూమిని వదిలేసినట్టు. అసలు ఫుల్ట్యాంక్ లెవల్ అంటేనే జలాశయం భర్‌పూర్‌గా, పూర్తిగా నిండినప్పుడు నీళ్లు ఎక్కడిదాకా నిలిచి ఉంటాయనే లెక్క. ఎవరైనా మన అవసరాల కోసం ఆ లెక్కను తగ్గిస్తారా? మరి జలమండలి ఎలా తగ్గించింది.