గద్వాల, జూలై 17 : సీడ్ పత్తి రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. పండించిన సీడ్ పత్తి విత్తనాలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి స్టేజీ వద్ద బుధవారం రైతులు నిరసన తెలిపారు. సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు, రైతులతో కలిపి కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేయిస్తామని జిల్లా అధికారుల హామీ మేరకు శాంతించారు.
అధికారుల సూచన మేరకు రైతులు గురువారం కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టర్‌ను కలవకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన రైతులు సీడ్ పత్తి మొక్కలతో అక్కడే బైఠాయించారు. వీరి ఆందోళనకు బీఆర్ఎస్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. కడుపుమండి ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని రైతులు తెలిపారు.