Beerla Ilaiah | యాదగిరిగుట్ట, అక్టోబర్ 25: అధికారంలోకి వచ్చిన రెండేండ్లకాలంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రూ.200 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుసు మహేశ్ శనివారం ఏసీబీ, ఐటీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీర్ల అయిలయ్య తన అనుయాయులైన ధనావత్ శంకర్ నాయక్, చాడ భాస్కర్‌రెడ్డి, భూక్యా రాజారాం, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, శిఖ ఉపేందర్‌తో పాటు మరి కొంత మందిని బినామీలుగా మార్చుకుని 100 ఎకరాలు అక్రమంగా కూడబెట్టారని ఆరోపించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 200 కోట్లపైనే ఉంటాయని పేర్కొన్నారు. ఇంత పరిమిత కాలంలో ఇన్ని ఆస్తులు సంపాదించడం ప్రజాస్వామ్య దేశంలో ఎలా సాధ్యమని ప్రశ్నించాడు. అక్రమాస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలను ఏసీబీ, ఆదాయపు పన్నుశాఖ అధికారులను సమర్పించామని, పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించారు.
2023 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతున్నది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తనకు 43 ఎకరాల భూమి ఉన్నట్టు పేర్కొన్నాడు. కానీ తన పేరు, తన భార్య బీర్ల అనిత పేరు ఉన్న వివిధ రకాల ఆస్తులను వెల్లడించలేదని గతంలో బొడుసు మహేశ్ కేసు వేశాడు. తాజాగా రూ. 200 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టాడని ఆరోపిస్తూ ఏసీబీ, ఆదాయ పన్నుశాఖ అధికారులకు పిర్యాదు చేశాడు. దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.