జోగులాంబ గద్వాల : గద్వాల జిల్లా కోర్టు ( Gadwal court ) ఆసక్తికర తీర్పును ఇచ్చింది. నూతన చట్టాన్ని అమలు చేస్తూ జైలు ( Jail ) కు బదులు సమాజసేవ ( Social Servaice) చేపట్టాలని సదరు వ్యక్తికి తొలి తీర్పునిచ్చింది. జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఉమ్మిత్యాల గ్రామానికి చెందిన ఈరన్న (30) అనే వ్యక్తి నందిన్నె గ్రామం ప్రధాన రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్న అతడిని స్థానిక ఎస్సై బిజ్జా శ్రీనివాసులు కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరపరిచారు.
ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టులో హాజరైన నిందితుడు ఈరన్న తన తప్పును అంగీకరించాడు. భారత న్యాయ సురక్షా స్మృతి (BNSS) చట్టంలోని 355వ సెక్షన్ ఉపయోగిస్తూ గద్వాల మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉదయ్ నాయక్ (Megistrate Udaynayak) జైలు శిక్షకు బదులుగా సమాజ సేవ విధిస్తూ తీర్పునిచ్చారు.
తీర్పు ప్రకారం, నిందితుడు ఈనెల 12న ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి జంక్షన్ వద్ద ‘ మత్తులో వాహనం నడపవద్దు’ అని రాసిన ప్లకార్డు పట్టుకుని నిలబడి మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి హెచ్చరికలు వెళ్లేలా చూడాలని , శిక్ష దండన రూపంలో కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కలిగించడం అవసరంమని న్యాయమూర్తి ఉదయ నాయక్ తీర్పులో పేర్కొన్నారు.