హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయ సంఘాలు తమ వంతు పాత్రను పోషించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆకాంక్షించారు. ఈ దిశలో సంఘాలు కృషిచేయాలని కోరారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు ఉద్యోగ విరమణ సన్మానసభను శుక్రవారం దోమల్‌గూడలోని పింగలి వెంకటరాంరెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు, పీఆర్టీయూ సంఘ బాధ్యులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఆరు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కమలాకర్‌రావు అందించిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బీ మోహన్‌రెడ్డి, పూల రవీందర్, పేరి వెంకట్‌రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డి, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎనుగుల సత్యనారాయణ, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.