Comrade Vijay | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కమ్యూనిస్టు విప్లవకారులంతా ప్రియతమ నాయకుడిగా పిలుచుకునే కామ్రేడ్ విజయ్ (74) ఈ నెల 12న మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ పీడిత వర్గాల కోసం, కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, కృషి చిరస్థాయిగా నిలిచిపోతాయని అంటున్నారు ఆయన ఉద్యమ సహచరులు. కామ్రేడ్ విజయ్‌ది కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం లంకపల్లి గ్రామం. 1951 మార్చి 19న జన్మించారు. ఆయన పూర్తి పేరు శిష్ట్లా విజయ్‌శర్మ. తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ, ఎస్ఆర్ఆర్ స్వామి. ఆయన సోదరుడు ప్రముఖ జర్నలిస్టు సుబ్బారాయుడు. ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండటంతో లైబ్రరీల్లోనే చదువుకుంటూ మెట్రిక్, పీయూసీ పూర్తిచేశారు. తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టుకు సమానమైన ఏఎంఐఈ పరీక్ష పాసయ్యారు.
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఎఫ్సీలో ఉద్యోగంలో చేరారు. తన సోదరుడు సుబ్బరాయుడు అప్పట్లో విప్లవకారుల కార్యకలాపాలకు కేంద్రంగా ఉండటం, ఆయనకు స్వతహాగా కమ్యూనిజం భావాలు ఉండటంతో అటువైపు ఆకర్షితులయ్యారు. ఎన్ఎఫ్సీలో కార్మికులను కూడగట్టి సంఘాలు ఏర్పాటు చేశారు. అలా ‘భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (మార్క్సిస్ట్-లెనినిస్టు)’ (యూసీసీఆర్ఐ-ఎంఎల్) వైపు అడుగులు వేశారు. 1975 నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ హైదరాబాద్ కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ విస్తృతి కోసం అనేక పోరాటాలు చేశారు. 1981లో ఎన్ఎఫ్సీకి రాజీనామా చేసి కార్మిక సమస్యలపై పోరాడారు. తన కార్యకలాపాలను జంటనగరాలలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు, కార్మిక కేంద్రాలకు విస్తరింపజేశారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై చేసిన అధ్యయనాలు అయనను పరిపూర్ణమైన కమ్యూనిస్టుగా మార్చాయి.
విప్లవోద్యమంలో కామ్రేడ్ విజయ్ చరుగ్గా ఉండేవారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. 1981 నుంచి చనిపోయే వరకూ ఆయన యూసీసీఆర్ఐ-ఎంఎల్ రాష్ట్ర కమిటీకి కీలకపాత్ర పోషించారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రభుత్వాధికారులకు తెలియకుండా సంఘం ఏర్పాటు చేసేవారు. ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వానికి తెలియకుండా దాదాపు 40 ఏండ్ల పాటు విజయ్ అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన పేరుతో ఎలాంటి స్టేట్మెంట్లు ఉండేవి కావు. అధికారులను కలిసేవారు కాదు. సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపాలో అధ్యయనం చేసి, ఆ దిశగా పోరాటాలు చేసేవారు. 1981 నుంచి 1991 వరకూ తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఎన్నో ఉద్యమాలు చేశారు. 1999 మార్చిలో విజయ్ను అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చావు అంచులవరకూ తీసుకెళ్లారు.
అప్పుడు వేలాదిమంది రోడ్లెక్కి విజయ్ కోసం పోరాడారు. ఆ దెబ్బలు తట్టుకొని మళ్లీ నెల రోజుల్లోనే పోరాటంలో కలిశారు. ఎన్ఎఫ్సీ సమ్మె, గ్లాస్ ఫ్యాక్టరీ సమ్మె, తిరుపతిలో 2,500 మందికి ఇండ్ల స్థలాల కోసం పోరాటం, హైదరాబాద్‌లోని మౌలాలిలో 2,000 మంది పేదలకు ఇండ్ల కోసం పోరాటం, గుంటూరు, రేపల్లె, విజయవాడలో చేపల చెరువుల కోసం పోరాటం, సింగరేణి గని కార్మిక సంఘం ఉద్యమం, ఆదిలాబాద్ పోడు భూముల పోరాటం, కరీనంగర్, ఖమ్మంలో కార్మిక పోరాటాల వెనుక ఆయన ఉన్నారు. ఉన్నత చదువులు, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం ఇవ్వని సంతృప్తిని ప్రజా ఉద్యమాలు ఇచ్చాయని అనేవారు కామ్రేడ్ విజయ్.