హైదరాబాద్, మే2 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇటీవల అందజేసిన నివేదికలోని అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో ఈఎన్సీ (ఓఅండ్ఎం), రామగుండం సీఈ, సీడీవో సీఈ, క్వాలిటీ కంట్రోల్ సీఈలతో కమిటీని నియమించింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రిపోర్టును పరిశీలించి బరాజ్‌ల రక్షణ, పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై, అదేవిధంగా బరాజ్‌లపై ఆధారపడిన ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రతిపాదనలను పంపించాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.