Revanth Reddy | హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : ఓ వైపు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం రెండు రోజుల పాటు తెల్లవార్లూ బార్, అండ్ రెస్టారెంట్లకు అనుమతించి మద్యం అమ్మకాలను ప్రోత్సహించిన రేవంత్ సర్కార్ మరోవైపు ఇవే బార్లు, రెస్లారెంట్ల వేదికగా ప్రచార ఆర్భాటానికి పోయింది. అదేదో ప్రభుత్వం గొప్పగా అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ ప థకాలు అయితే ఫర్వాలేదు కానీ, మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్‌బాల్ ఆడిన వీడియోలు ప్లే చేయించి విమర్శలు మూటగట్టుకున్నది.
‘ప్రజల తీర్పుతో కాదు.. ప్రచారంతోనే పేరు సం పాదించుకోవాలి’ అని అనుకున్నట్టున్నదో ఏమో మరి! సచివాలయం సరిపోలేదు.. సభ లు, సమావేశాలు సరిపోలేదు.. ఐఅండ్ పీఆర్ శాఖ ఊదరగొట్టుడు సరిపోలేదు. చివరికి మద్యం గ్లాసును ప్రభుత్వ ప్రచార వేదికలుగా మార్చే స్థాయికి అధికార యంత్రాంగాన్ని దిం పింది. ప్రపంచ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు బార్లకు వచ్చిన వారికి మద్యం పోస్తూ.. మెస్సీతో సీఎం రేవంత్ ఆడిన వీడి యో క్లిప్పింగ్‌లతో హోరెత్తించింది. ఇందుకోసం ఎక్సైజ్ శాఖను దిగజార్చి ప్రచార నిర్వాహక శాఖగా మార్చేసింది. బార్ స్రీన్లను ప్రచార తెరలుగా మార్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్‌పై ఉతంఠలో మునిగిపోయిన వేళ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన సొంత ప్రచారవేటలో నిమగ్నమైంది. క్రీడాభిమానులు ఆటను ఆస్వాదించేందుకు బార్లు, రెస్టారెంట్లకు వెళ్తే, వారిని ఏమార్చి ప్రేక్షక బందీలుగా మార్చింది. పెద్ద స్క్రీన్లు పెట్టి మందుబాబులకు ‘మన సీన్ వేశారో? లేదో?’ చూడటం కోసం ఎక్సైజ్ శాఖ నుంచి ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు రెండుసార్లు, హాఫ్ టైమ్‌లో మరో రెండుసార్లు నిర్దిష్టంగా రేవంత్‌రెడ్డి మెస్సీతో ఫుట్‌బాట్ ఆడుతున్న వీడియో క్లిప్‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని, ఆ ఆదేశాలు అమలయ్యాయని వీడియోలు తీసి అధికారులకు పంపించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు వాట్సాప్ సందేశాలు పంపడం తీవ్ర చర్చకు దారితీసింది. ఒకప్పుడు ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమాచార పౌర సంబంధాల శాఖపై ఆధారపడేవి. ప్రజాకర్షక పథకాలను చూపించడం తప్పు కాదు, కానీ దానికోసం ప్రభుత్వ చట్టబద్ధమైన శాఖలను ప్రచార ఏజెంట్లుగా మార్చడం అశాస్త్రీయం, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమనే విమర్శలు వస్తున్నాయి.
వాట్సాప్ సందేశాల్లో కనిపించిన ‘Ensure play, Without fail, Shall post me videos personally or in group’ వంటి పదాలు కేవలం విజ్ఞప్తులుగా లేవని, అవి అధికారిక ఆదేశాల భాషను ప్రతిబింబిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బార్ యజమానులు వీడియో వేస్తే సరిపోదు… అది వేశారనే ఆధారాన్ని కూడా పంపాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలివ్వటం వివాదాస్పదంగా మారింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ‘ప్రజా పాలన చేస్తున్నదా?.. ప్రచారంతో గడుపుతున్నదా’? అనే చర్చకు దారితీసింది. కాగా దీనిపై ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ వివరణ కోరగా.. బార్లలో స్క్రీన్ మీద వీడియోలు ప్లే చేయాలని తాను ఎలాంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వలేదని స్పష్టం చేశారు.