హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : భూములివ్వనందుకే లంబాడీలపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష కట్టారని లంబాడీ హక్కుల పోరాట సమితి, సేవాలాల్ సేన నేతలు రాంబల్‌నాయక్, సంజీవ్‌నాయక్ విమర్శించారు. లంబాడీ రైతు హీర్యానాయక్‌ను బేడీలేసి తీసుకెళ్లడాన్ని నిరసిస్తూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హీర్యానాయక్‌కు ఏమి జరిగినా ప్రభుత్వమే పూర్తిబాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లంబాడీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి ఎందుకింత చిన్నచూపని ప్రశ్నించారు. భూములను లాక్కునేందుకు సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ప్రైవేట్ సైన్యంతో అమాయక లంబాడీలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. శాంతియుతంగా చేపట్టిన లగచర్ల రైతుల పోరాటాన్ని హింసామార్గంలోకి వెళ్లేలా చేశారని ధ్వజమెత్తారు. లంబాడీ రైతులపై అక్రమ కేసులు పెట్టి పోలీస్స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. లగచర్ల రైతుకు జైల్లో గుండెపోటు వస్తే సంకెళ్లతో దవాఖానకు తీసుకెళ్లిన తీరు రేవంత్‌రెడ్డి క్రూరత్వానికి నిదర్శనమని విమర్శించారు. లగచర్ల బాధిత రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో కల్యాణ్, రాజు, హరి, అశోక్, దేవేందర్, చందూలాల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.