KTR | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు 12 వేలకు కుదించడం రైతులను నిలువునా వంచించడమే అని విమర్శించారు. ఈ ద్రోహాన్ని తెలంగాణ రైతాంగం ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసానికి పాల్పడ్డ ఈ కాంగ్రెస్ను రైతన్నలు పాతరేస్తారని అన్నారు. కాంగ్రెస్ చేసిన దానికి మోసం అనే పదం చిన్నదైపోతది. దగా, నయవంచన పదాలు కూడా సరిపోవని విమర్శించారు. కాంగ్రెస్ రైతాంగానికి చేసిన ఈ ద్రోహం.. తెలంగాణ చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కపట నాటకాలకు, నోరు తెరిస్తే అబద్ధాలకు, బూటకపు వాగ్దానాలకు కేరాఫ్ కాంగ్రెస్/రేవంత్ అని రైతాంగానికి అర్థమైపోయిందని అన్నారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రైతుద్రోహిగా మిగిలిపోతాడని చెప్పారు.
డిక్లరేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చే గ్యారెంటీ అని రాహుల్ గాంధీ అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. రైతు భరోసా 12 వేలకు కుదించి సంబరాలు చేయాలని కాంగ్రెస్ అంటోంది.. కానీ ఎందుకు సంబరాలు చేయాలి.. రైతన్నలకు 15000 ఇస్తామని చెప్పి కోతలు పెట్టినందుకా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేసినందుకు పాలాభిషేకాలు చేయాలా అని నిలదీశారు. కాంగ్రెస్ అబద్దాలకు డిక్షనరీలో కొత్త పదాలు కనిపెట్టాలని ఎద్దేవా చేశారు.
రైతు రుణమాఫీ, రైతుబంధుకు కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ రైతుబంధుగా నిలిచారు కానీ.. రేవంత్ రెడ్డి రాబందుగా మిగులుతారని విమర్శించారు. రాహుల్ గాంధీకి తెలంగాణకు వచ్చే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే 10 వేలు, తరువాత 15 వేలు రైతు భరోసా అన్న కాంగ్రెస్ నేతల మాటలు ఎక్కడ పోయాయని నిలదీశారు. గతంలో ఇచ్చిన పదివేలనే బిచ్చం అన్న రేవంత్.. మరి నువ్వు పెంచిన వెయ్యి రూపాయలు ఏంటి? ముష్టి వేస్తున్నావా అని మండిపడ్డారు.
ఓడ దాటే దాక ఓడ మల్లన్న.. ఓడ దాటాక బోడి మల్లన్న.. ఇదే కాంగ్రెస్ తీరు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ నుంచి రాహుల్ దాకా రైతులకు చెప్పిందేంటి? చేసిందేంటి అని ప్రశ్నించారు. ఇచ్చిన మాట తప్పడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి తీరని ద్రోహం చేసినందుకు తెలంగాణ ప్రజాక్షేత్రంలో రేరవంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని అన్నారు. నమ్మించి నయవంచన చేసినందుకు రాహుల్ గాంధీ 70 లక్షల మంది రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మ్యానిఫెస్టోలో రైతులకిచ్చిన ప్రధాన హామీని నిలబెట్టుకోనందుకు ముఖ్యమంత్రి ముందుగా రాష్ట్ర రైతాంగం ముందు లెంపలేసుకోవాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు రైతుభరోసాపై మాట మార్చినందుకు ప్రజాక్షేత్రంలో ముక్కు నేలకు రాయాలన్నారు.