CM Revanth Reddy | అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ విధిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణం ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బైరామల్‌గూడ ఫ్లై ఓవర్ శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఎస్ఆర్డీపీలో భాగంగా సాగర్ కూడలిలో రూ.148.05కోట్లతో సెకండ్ లెవల్ వంతెన నిర్మించగా ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో సాగర్‌రింగ్‌రోడ్ కూడలలిలో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి. బైరామల్‌గూడ జంక్షన్లో వంతెనలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. వంతెన ప్రారంభంతో సిగ్నల్ ఫ్రీగా జంక్షన్ మారింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలు తీర్చేలు మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సేవలు అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను పొడిగించినట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌లో హైకోర్టు నిర్మించి అక్కడి వరకు మెట్రో నిర్మిస్తామన్నారు. రూ.50వేలకోట్లతో మూసీ నదిని ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఔటరింగ్ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నిర్మించింది కాంగ్రెస్సేనన్నారు. ఓఆర్ఆర్లోపలున్న అన్ని మున్సిపాలిటీలను హెచ్ఎండీలో కలుపుతామన్నారు. వైబ్రంట్ తెలంగాణ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామన్నారు. భవిష్యత్‌లో నిర్మించే ఆర్ఆర్ఆర్తో రాష్ట్రం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కొందరు పాతబస్తీలో మెట్రో ఆపాలని చూస్తున్నారని.. మెట్రోను ఆపాలని కేంద్రానికి పదేపదే చెబుతున్నారని సీఎం అన్నారు. కేంద్రాన్ని ఉసిగొల్పేవారిని ముందే హెచ్చరిస్తున్నానన్నారు. పాతబస్తీ మెట్రోను ఆపాలని నిన్న ఎవరో ఢిల్లీకి చెప్పారని.. అభివృద్ధి పనులను అడ్డుకునే వారికి నగర బహిష్కరణ విధించాలన్నారు.