హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకొనేందుకు అష్టకష్టాలు పడుతూ ఉంటే.. వచ్చే పదేండ్లలో తెలంగాణను ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.84 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా మారుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. అదే తన విజన్ అని అన్నారు.
పద్నాలుగురోజుల విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన సీఎం.. ఇకపై తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని ప్రపంచంతోనేనని ప్రకటించారు. కోకాపేటలో కాగ్నిజెంట్ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..హైదరాబాద్‌కు 430 సంవత్సరాల చరిత్ర ఉన్నదని, ఎన్ని వ్యవస్థలు మారినా ప్రతి ఒకరూ హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడ్డారని అన్నారు.
ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు హైదరాబాద్‌ను నాలుగో ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనుకుంటన్నట్టు వెల్లడించారు. చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం అమెరికా, సౌత్కోరియా తదితర దేశాలు ఎదురుచూస్తున్నాయని వాటన్నింటికి ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ సమాధానం చెప్తుందని అన్నారు. తమ పర్యటనల ద్వారా రాష్ర్టానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు తెచ్చామని, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని సీఎం తెలిపారు.
త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనుట్టు చెప్పారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రతి ఒకరూ హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నారని అన్నారు. ఒక రోజులోనే ఇకడ ఐటీ రంగం అభివృద్ధి చెందలేదని, 1992లో ప్రారంభమైన ఐటీ పరిశ్రమను ఎంతో మంది ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ సూర్యగుమ్మడి మాట్లాడుతూ.. తమ నెట్‌వర్క్‌లో హైదరాబాద్ కీలకమైన హబ్ అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.46 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో భారతదేశంలోనే 2.40 లక్షల మంది, వారిలో 57వేల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేశ్‌రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి వేముల శ్రీనివాసులు, కాగ్నిజెంట్ ప్రతినిధులు క్యాథీ, జాన్కిమ్ తదితరులు పాల్గొన్నారు.