అంబర్‌పేట, ఆగస్టు 31: ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబర్‌పేట మున్సిపల్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జీహెచ్ఎంసీ పరిధిలోని 16 సర్కిళ్లకు చెందిన మహిళా పొదుపు గ్రూపు సభ్యులను, స్థానిక మహిళలను అధికారులు తరలించారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మహిళలు సభాస్థలికి చేరుకోగా.. సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో సీఎం సభాస్థలికి వచ్చి ప్రసంగం మొదలుపెట్టారు. దాదాపు గంటసేపు వెయ్యిరోజుల ప్రజాపాలనపై ప్రసంగించారు.
అయితే మూడున్నర గంటలపాటు సీఎం రాకకోసం ఎదురుచూసిన మహిళలు తాగేందుకు మంచినీళ్లు దొరుకక విసిగి వేసారి ముఖ్యమంత్రి మాట్లాడుతుండగానే బయటకు వెళ్లిపోయారు. దీంతో సభాస్థలిలో కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రౌండ్‌కు ఇరువైపులా ఉన్న గేట్లకు తాళం వేసి మహిళలు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.