మెడికల్ సీట్లలో ‘ఉమ్మడి’ కోటా జూన్ 2తో ముగుస్తుందని తెలిసినా రేవంత్ సర్కార్ తగిన చర్యలేవీ తీసుకోలేదు. కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ అలర్ట్ చేస్తూ లేఖరాసినా సర్కారు స్పందించలేదు. పొరుగు రాష్ట్రం ఏపీ ‘స్థానికత’ను నిర్ధారిస్తూ జీవో తెచ్చినా మన ప్రభుత్వం అప్రమత్తం కాలేదు. తీరా అడ్మిషన్ల ముంచుకురాగానే అప్పుడు మేల్కొన్నది. అప్పటికప్పుడు ఆగమేఘాలపై ఉత్తర్వులు తెచ్చింది. ‘స్థానికత’ను నిర్ధారించే నిబంధనలను మార్పు చేస్తూ తెచ్చిన జీవో 33తో విద్యార్థులు హతాశయులయ్యారు.
Medical Seats | హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్థానికత నిర్ధారణలో ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నది. స్థానికత నిర్ధారణ కోసం ఈ ఏడాది ప్రారంభం నుంచే విజ్ఞప్తులు అందినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ, ఏపీ మధ్య ఈ ఏడాది జూన్ 2తో ‘ఉమ్మడి’ బంధం శాశ్వతంగా ముగిసిపోతుందని ముందుగానే తెలిసినా పట్టించుకోలేదు. చివరిక్షణాల్లో జీవో ఇచ్చిన పాలకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మెడికల్ సీట్లలో ఉమ్మడి కోటాపై నిర్ణయం తీసుకోవాలని, స్థానికతను నిర్ధారించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఈ ఏడాది జనవరిలోనే వైద్యారోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాసినట్టు సమాచారం. సాంకేతిక విద్యాశాఖ సహా వివిధ యూనివర్సిటీల నుంచి ప్రభుత్వానికి ఇలాంటి విజ్ఞప్తులే అందినా పక్కన పెట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇంజినీరింగ్ ప్రవేశాల సమయంలోనూ ఉమ్మడి కోటాపై తర్జనభర్జన జరిగింది. అయితే జూన్ 2కు ముందే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడంతో ‘ఉమ్మడి’ కోటా కొనసాగించాల్సి వచ్చింది. మెడికల్ సీట్లపై మాత్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. యూనివర్సిటీ నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు అందినా వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకోలేదు. చివరికి తప్పని పరిస్థితుల్లో జూలై 19న తూతూమంత్రంగా జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నది. విమర్శలు వస్తాయన్న భయంతో ఆ జీవోను కూడా బహిర్గతం చేయకుండా రహస్యంగా ఉంచింది. రెండు వారాల తర్వాత నోటిఫికేషన్‌తోపాటు విడుదల చేసింది.
మరుసటి రోజు నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉండటంతో పెద్దగా పట్టించుకోరని ప్రభుత్వం భావించగా.. పరిస్థితి తలకిందులైంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, జీవో 33లో మార్పులు చేయడంతోపాటు భవిష్యత్తులో మళ్లీ సమస్య రాకుండా సమగ్ర అధ్యయనం జరిపి స్థానికతను నిర్ధారించాలని కోరుతున్నారు.
జూన్ 2 తర్వాత ఉమ్మడి కోటా ఉండవని ఏపీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకు స్థానికత, రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రత్యేక కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, 8 మంది ఉన్నతాధికారులు, అడ్మిషన్ల రంగంలో నిపుణులు ఒకరిని సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది. స్థానికత, ఉమ్మడి కోటా అంశంపై నిపుణులు, విద్యార్థులు, అసోసియేషన్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్థానికతను నిర్ధారించారు.
తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఎంబీబీఎస్, బీడీఎస్ నోటిఫికేషన్లో స్థానికతపై స్పష్టత ఇచ్చారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు గరిష్ఠంగా నాలుగేండ్లు చదివిన ప్రాంతాన్ని లోకల్‌గా గుర్తించాలన్న నిబంధనను కొనసాగిస్తూనే, కచ్చితంగా ఇంటర్ ఏపీలోనే చదవాలనే నిబంధన పెట్టారు. ఏపీలో ఇంటర్ చదవలేని వారికి కూడా ఓ వెసులుబాటు ఇచ్చారు. దీంతో అక్కడ స్థానికతపై వివాదాలు తలెత్తడం లేదు.