నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 22 (నమస్తే తెలంగాణ): పోలీసులు తనపై తప్పుడు కేసు బనాయించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించానని, వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించానని అనటం అబద్ధమని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మీర్ విరాసత్ అలీ ఇచ్చిన ఫిర్యాదుపై నిర్మల్ పోలీసులు 2023లో నమోదు చేసిన కేసు విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జడ్జి శ్రీదేవి ముఖ్యమంత్రినుద్దేశించి.. దర్యాప్తు అధికారితోపాటు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తప్పు చేశారా? అని ప్రశ్నించారు. దీనికి సీఎం.. ‘పోలీసులు నాపై తప్పుడు కేసు బనాయించారు’ అని చెప్పారు. పోలీసులను అసభ్యంగా తిట్టారని, వారి మనోభావాలు తినేలా మాట్లాడారని సాక్షులు చెప్పారని జడ్జి తెలుపగా.. అదంతా అబద్ధమని సీఎం అన్నారు. ఈ కేసులో తదుపరి వాదనలు వినిపించాలని ఆదేశిస్తూ విచారణను జూన్ ఒకటో తేదీకి వాయిదా వేశారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నాడు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిర్మల్ పోలీసులు సెక్షన్లు 294-బీ, 189, 506 ప్రకారం కేసు నమోదు చేసి చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ పోలీసుల పేర్లను తన డైరీలో రాసుకున్నానని, వారిని యూనిఫాం తీసి కొడతారని.. వ్యాఖ్యానించినట్టు తెలిపారు.
ప్రజల రక్షణకోసం తెలంగాణ పోలీసులు బాధ్యతాయుతంగా 24 గంటలు విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ వారి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం పోలీసుల మనోభావాలను దెబ్బతీయరాదని ఫిర్యాదులో తెలిపారు. సాక్ష్యాధారాలు లేకుండా పోలీసులపై విరుచుకుపడి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. పోలీసుల మనోభావాలను దెబ్బతీసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును ఇటీవల నిర్మల్ పోలీసు సేష్టన్నుంచి బేగంబజార్‌కు బదిలీ చేశారు.