చిక్కడపల్లి, అక్టోబర్ 27 : ఇక నుంచి ప్రతి సంవత్సరం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిపార్క్ ధర్నా చౌక్ వద్ద యాదవ్ సదర్ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సదర్ సమ్మేళనాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.