Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు సరిగ్గా ఒక్క రోజు ముందే ఎందుకు కలవాల్సి వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం అంత తొందరగా అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. సీఎంకు అర్జెంటుగా కలవాల్సిన అవసరం కూడా లేదు.. రేవంత్‌రెడ్డి ఇచ్చిన వినతుల్లో అర్జెంటు పనులేవీ లేవు. అయినప్పటికీ గంటల్లోనే అపాయింట్మెంట్ ఖరారవ్వడం, కలవడం ఏంటనే చర్చ జరుగుతున్నది. రెండు రోజుల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తమ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఓడినా తమ పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు.
ఓవైపు అక్కడ సొంత పార్టీ అభ్యర్థి ఓటమిని కోరుకుంటూ మరోవైపు ప్రత్యర్థి పార్టీకి చెందిన, ప్రధాని మోదీని కలవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ లభించడమే గగనమైన పరిస్థితుల్లో గంటల వ్యవధిలో ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దక్కడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అసలు ఆంతర్యం ఏమిటని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి మేలు చేకూర్చేలా మోదీతో రేవంత్‌రెడ్డి మాట్లాడుకుని వచ్చారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ఎప్ప టికైనా బీజేపీలో చేరడం ఖాయమని, అందుకే తరచుగా మోదీతో మంతనాలు సాగిస్తున్నారని మరికొందరు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నదని, చంద్రబాబు ఆశీస్సులతో రేవంత్ యెల్లో కాంగ్రెస్ పాలన సాగిస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు.