హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీకేజీ, గ్రూప్-1 పరీక్షల తారుమారుతో విద్యార్థులు, నిరుద్యోగులను దగా చేసిన ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డిపై శుక్రవారం బీఆర్ఎస్ సమరభేరి మోగించనున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రకటించారు. గురువారం బీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్‌లో విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాల భర్తీలో ఘోరంగా విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డికి నీట్ లీకేజీ గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని దాసోజు ప్రశ్నించారు. కేటీఆర్ పుట్టినరోజును అట్టహాసంగా నిర్వహించేందుకు అభిమానులు, యువత, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమైనా కేటీఆర్ వారించారని చెప్పారు. ఇది సంబురాలు చేసుకోవాల్సిన సమయం కాదు.. పోరాడాల్సిన సమయమని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు ఉపక్రమించారని పేర్కొన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నిరుద్యోగులను ముంచిన రేవంత్‌రెడ్డి
ఏటా రెండు లక్షల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని గాలికొదిలి నిండా ముంచారని శ్రవణ్ మండిపడ్డారు. 2 లక్షలు దేవుడెరుగు కనీసం 10వేల ఖాళీలు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీలో కేంద్ర మంత్రి ఎంతటి నేరస్తుడో.. రాష్ట్రంలో టీజీపీఎస్సీ ద్వారా జీవో 29 తెచ్చి గ్రూప్-1లో అక్రమాలకు కారకుడైన సీఎం సైతం అంతే పెద్దనేరస్తుడని విరుచుకుపడ్డారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి రాజీనామా కోరుతున్న రాహుల్‌గాంధీకి తెలంగాణలో అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసుల దాష్టీకాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక న్యాయం.. హైదరాబాద్‌లో మరో న్యాయమా? అని నిలదీశారు. నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్, గ్రూప్-1లో అవకతవకలకు కారకుడైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని దాసోజు డిమాండ్ చేశారు.