నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకొన్నది. ప్రచారంలో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సీఎం సభకు మునుగోడు నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మూడునాలుగు రోజులుగా బహిరంగసభకు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తుండటంతో పెద్దసంఖ్యలో ప్రజలు తరలిరానున్నట్టు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చండూరు నుంచి అంగడిపేట దాటాక ఎకరం విశాలమైన స్థలంలో సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు వచ్చే వారి వాహనాల పార్కింగ్, వీఐపీల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. సీఎం రాకకోసం హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు.
ప్రచారంలో టీఆర్ఎస్ జోరు
మునుగోడు ఎన్నికల ప్రచారంలో అధికార టీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రా మగ్రామాన ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలను చేరవేస్తూ ఓటర్లను ఆకట్టుకోవడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యింది. ఓటర్లం తా టీఆర్ఎస్ వైపే మొగ్గుచూపుతున్నట్టు అనేక సర్వేల్లో స్పష్టమైంది. ప్రాంగణానికి ఐదారు కి లోమీటర్లలోపు గ్రామాల వారంతా కాలినడకన సభకు చేరుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
సీఎం కేసీఆర్ బంగారిగడ్డ సభపై మునుగోడు నియోజవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానితోపాటు సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఎలా స్పందిస్తారన్న దానిపైనా ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. మోదీ సర్కారు విధానాలపై పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారన్న చర్చ కూడా జోరుగా సాగుతున్నది. ముఖ్యమంత్రి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో కలిసి సభా వేదిక వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
బహిరంగ సభకు తరలిరావాలి
యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): చండూ రు మండలం బంగారిగడ్డలో ఆదివారం నిర్వహించే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వేలాదిగా తరలివచ్చి జయపద్రం చేయాలని టీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ రాక కోసం, ఆయన ప్రసంగం వినేందుకు మునుగోడు ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. బీజేపీ కుట్రలు, కుతంత్రాలను కేసీఆర్ వివరిస్తారని పేర్కొన్నారు. అభివృద్ధి ఆగిపోయిందని చెబుతూ రాజగోపాల్‌రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయారని విమర్శించారు. బండి సంజయ్ సిగ్గు లేకుండా యాదాద్రిలో ప్రమాణం చేశారని, ఎవరు అడిగారని ప్రమాణం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ స్వామిజీలను ముందుపెట్టి కుట్ర చేయడం బీజేపీకే దక్కిందని, ఆ పార్టీ పన్నాగాలను కేసీఆర్ బట్టబయలు చేశారని చెప్పారు.