Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించారు. సోమేశ్వర లక్ష్మీనారసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొడకండ్ల చర్చిలో ప్రార్థనలు, తొర్రూరు మసీదు, అన్నారం షరీఫ్‌లో సమాజులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నిర్లక్ష్యానికి గురైన ఆలయాలతో పాటు మన కవులు, కళాకారులకు తెలంగాణ వచ్చాకే తగిన గౌరవం, గుర్తింపు దక్కిందన్నారు. కనీవినీ ఎరుగతి రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు వేములవాడ రాజన్న, వరంగల్ భద్రకాళి, ఐనవోలు, కొమురవెళ్లి మల్లన్న తదితర పురాత దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ జరుగుతుందన్నారు. ధూప దీప నైవేద్యాలకు నోచని చిన్న చిన్న గుడులు, గోపురాలు నేడు కళకళలాడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో పాలకుర్తి, బమ్మెర, వల్మీడి కారిడార్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు.
మూడు ఆలయాల పేరున రూ.62.50 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. పాలకుర్తి గొప్ప మహిమాన్విత క్షేత్రమన్నారు. ఇక్కడ ఆది కవి సోమనాథుడు పుట్టారన్నారు. పక్కనే ఉన్న బమ్మెరలో పోతన పుట్టాడని, రామాయణం రాసిన వాల్మీకి, పక్కనే వల్మీడిలో కొంతకాలం ఉండి మునులగుట్టల తపస్సు చేశాడని తెలిపారు. పాలకుర్తి కవులు, కళాకారులకు పుట్టినిలని, తొలి తెలుగు ఆది కవి పాల్కురికి సోమనాథుడు మనవాడుకావడం మన అదృష్టమన్నారు.
ఆయన నడిచిన ఈ నేలలో మనమంతా జన్మించడం మన పూర్వజన్మ సుకృతమన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగిన సమయంలో ఆ ప్రాంగణానికి పాల్కురికి సోమనాథుడు పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి దేవాలయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించారు. ఎకరం స్థలంలో రూ.3కోట్లతో సేవాలాల్ ఆలయం, రూ.కోటితో చెన్నూరు త్రికూటాలయం, రూ.13.91కోట్లతో సన్నూరు దేవాలయం, రూ.3.55కోట్లతో వాన కొండయ్య లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, పాలకుర్తిలో ప్రత్యేకంగా రూ.25 కోట్లతో పర్యాటక హోటల్ భవన నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.