ఖమ్మం : సీఎం కేసీఆర్ ప్రజలకు కనిపిస్తారు. ప్రతిపక్షాలకు కాదు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజనరెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం నారాయణ పురం గ్రామంలో జరిగిన రైతు సంబురాల్లో మంత్రులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..మొక్కలో, గింజలో, నీటిలో, కరెంటులో ప్రతి చోటా కేసీఆర్ కనిపిస్తున్నారన్నారు. వ్యవసాయం కోసం అందుతున్న రైతుబంధు డబ్బుల్లో కేసీఆర్ కనిపిస్తున్నారని తెలిపారు. రైతుబంధు అమలు సాధ్యం కాదని అన్నారు.
కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని పేర్కొన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వ విధానాలలో, ప్రజలకు అందే పథకాల్లో కేసీఆర్ కనిపిస్తారని మంత్రి తెలిపారు. మొలకెత్తే విత్తనాలతో, మొక్కలతో తీర్చిదిద్దిన కేసీఆర్ చిత్రపటం అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
ఉచిత కరంటు కోసం ఏటా రూ.10 వేల కోట్లు, ప్రాజెక్టుల కోసం ఏటా రూ.25 వేల కోట్లు, రైతుబీమా కోసం రూ.1400 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల బలోపేతం కోసం ఏటా రూ.60 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను వరసబెట్టి కేంద్రం అమ్మేసింది.
కార్పొరేట్లు లేని వ్యవసాయ, ఆహార రంగాలను కార్పొరేట్ల పరం చేయడమే కేంద్రం ఉద్దేశమని ఆరోపించారు. అదే అమలైతే దేశ ప్రజలంతా అంబానీ, ఆదాని దయాదాక్షిణ్యాల మీద బతకాలన్నారు. కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాల చిల్లర మాటలను ప్రజలు గమనిస్తున్నారు.
సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి బుద్ధిచెబుతారన్నారు. ఆయిల్ పామ్ సాగులో భవిష్యత్ లో తెలంగాణను ఆదర్శంగా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.