హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి సోపానంగా పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందని కుటుంబమే లేదని పేర్కొన్నారు. గోల్కొండ కోటలో మంగళవారం స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం మాట్లాడారు. గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు చాలీచాలని ఒకే ఒక ఇరుకు గదితో ఉండేవని, అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేందుకు రెండు పడక గదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్మాణం పూర్తయిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేయటం ప్రారంభించిందని చెప్పా రు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని, ముందుగా ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ ప్రయోజనం అందుతుందని పేర్కొన్నారు. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించామని వెల్లడించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇండ్లల్లో ఉచితంగా ప్రభుత్వమే నల్లాలు బిగించి, సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తున్నదని చెప్పారు. మిషన్ భగీరథకు నేషనల్ వాటర్ మిషన్ అవార్డు, జల్ జీవన్ అవార్డులతో సహా అనేక అవార్డులు, ప్రశంసలు లభించాయని గుర్తుచేశారు.
ప్రతి పథకం సంచలనమే
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకం దేశంలో సంచలనాలు సృష్టిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దళితజాతి స్వావలంబన కోసం ప్రభుత్వం దళితబంధు పథకం అమలు చేస్తున్నది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.10 లక్షలు నూటికి నూరుశాతం గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వ లైసెన్సుతో చేసే లాభదాయక వ్యాపారాల్లో దళితులకు 15శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తున్నది. ఇదే తరహాలో బలహీన వర్గాల్లోని వృత్తిదారులకు, మైనారిటీకు కుటుంబానికి రూ.లక్ష వంతున గ్రాంటు రూపంలో అందిస్తున్నది. దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపల పెంపకం, గీత కార్మికులకు ఈత, తాటి చెట్లపై పన్నును రద్దు చేసింది.
మద్యం దుకాణాల లైసెన్సుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నది. రైతు బీమా తరహాలో గీతన్నలకు పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమా కల్పించింది. నేత కార్మికులకు నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నది. గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందించడం కోసం ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని అమలుకు నిర్ణయం తీసుకొన్నది. నేతన్నలకు సైతం పైసా భారం లేకుండా రూ.5 లక్షల బీమాను కల్పిస్తున్నది. అసహాయులకు జీవన భద్రతకోసం అందించే ఆసరా పెన్షన్‌ను రూ.200 నుంచి రూ.2,016కు పెంచింది. 2014లో లబ్ధిదారులు 29 లక్షలుంటే, నేడు 44 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించింది. పెన్షన్ వయో పరిమితిని 60 నుంచి 57 ఏండ్లకు తగ్గించింది. ఇటీవల దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ. 4,016కు పెంచింది’ అని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అనాథల పిల్లల సంరక్షణ బాధ్యతను సంపూర్ణంగా స్వీకరించిందని, వారిని ‘స్టేట్ చిల్డ్రన్’గా పేరొంటూ ‘ఆర్ఫాన్ పాలసీ’ని రూపొందించిందని చెప్పారు. ఇకపై అనాథ పిల్లలను రాష్ట్ర ప్రభుత్వమే అకున చేర్చుకొంటుందని వెల్లడించారు.
ఆర్టీసీ బిల్లును అడ్డుకొనేందుకు కుట్ర
ఆర్టీసీని, అందులోని 43,373 మందిని కాపాడేందుకు సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందిన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని విమర్శించారు. వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందని, ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం నిండిందని తెలిపారు.
ఐఆర్ ఇస్తాం.. పీఆర్సీ కమిషన్ వేస్తాం
ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం విషయంలో కూడా తెలంగాణ మిగతా రాష్ట్రాలకంటే ముం దున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. ‘నేడు దేశం లో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. ప్రభుత్వోద్యోగులకు ఇప్పటివరకు రెండు పీఆర్సీల ద్వారా 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. త్వరలోనే కొత్త పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతాం. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తాం. సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చకదిద్దింది. కంపెనీ టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెంచింది. సింగరేణి కార్మికులకు ఈసారి దసరా, దీపావళి పండుగల బోనస్‌గా రూ.వెయ్యి కోట్లు పంపిణీ చేయబోతున్నది. ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా మిగిలిన వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. వీరిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కొత్తగా 14,954 పోస్టులను మంజూరుచేసింది. హైదరాబాద్‌ను సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రూ.67,149 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను అమలు చేస్తున్నది. రూ.69 వేల కోట్లతో మెట్రో రైల్ నెట్‌వర్క్‌ను ఓఆర్ఆర్ చుట్టూ విస్తరించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లో 415 కిలోమీటర్లకు మెట్రో సౌకర్యం విస్తరిస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
Kcr1
7.3 శాతం పేదరికం తగ్గుదల
‘సంపద పెంచు-ప్రజలకు పంచు’ అనే స దాశయంతో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతున్నదని ‘నీతి ఆయోగ్’ విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచీ స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం 2015-16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. అంటే ఏకంగా 7.3 శాతం పేదరికం రాష్ట్రంలో కనుమరుగైంది. పరిశుభ్రత, పచ్చదనంతో అలరారుతున్న మన గ్రామాలు, పట్టణాలకు ఇటీవల 13 జాతీయ అవార్డులు లభించాయి. గురుకుల విద్యలో తెలంగాణకు సాటిరాగల రాష్ట్రం మరొకటి లేదు. భావి భారత పౌరులు ఆరోగ్యంగా ఉండాలనే సత్సంకల్పంతో హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలను సైతం పెంచింది. మన ఊరు మన బడి -మన బస్తీ మన బడి పేరుతో ప్రభుత్వం రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నది. పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిం ది. రూ. 2.51లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. తొమ్మిదిన్నరేండ్లల్లో 17. 21లక్షల మందికి ఉపాధి లభించింది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 3,23,039 మంది ఐటీ ఉద్యోగులుండగా, అనంతరం 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 2014 నాటికి ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు కాగా, 2023 నాటికి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి అని సీఎం కేసీఆర్ వివరించారు.
వైద్యారోగ్య రంగంలో అద్భుత ప్రగతి
రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో మూడు ప్రభుత్వ వైద్య కళాశాలలుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకో వైద్య, నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే 21 కాలేజీలు ప్రారంభమయ్యాయని, మరో 8 కాలేజీల ఏర్పాటుకు ఇటీవలే క్యాబినెట్ ఆమోదముద్ర వేసిందని గుర్తుచేశారు. కంటి వెలుగు, ఉచిత డయాలసిస్ కేంద్రాలు, ఉచిత డయాగ్నస్టిక్ సెంటర్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్లు, బస్తీ, పల్లె దవాఖానల ఏర్పాటు అద్భుత ఫలితాలిచ్చిందని చెప్పారు. హైదరాబాద్ నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, వరంగల్‌లో రూ.1,100 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన, నిమ్స్‌లో మరో 2 వేల పడకల సామర్థ్యంతో నూతన భవనాల నిర్మాణం, 108, 104 సేవలు పెంచేందుకు 466 కొత్త వాహనాల ఏర్పాటు తదితర కార్యక్రమాలతో వైద్యారోగ్యరంగంలో విప్లవం తీసుకొచ్చామని వివరించారు.
అమర జవాన్లకు సీఎం నివాళి
ప్రగతిభవన్‌లో జాతీయజెండాను ఎగురవేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం అమరజవానుల సృ్మతి చిహ్నం వద్ద సీఎం కేసీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. సృ్మతి చిహ్నం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు సైనిక సంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలికారు. కేసీఆర్ అమరజవాన్ల స్మృతి చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఘన నివాళి అర్పించారు. ప్రగతిభవన్‌లో వేడుకలు: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, కడియం శ్రీహరి, దండె విఠల్, నవీన్‌కుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రగతి భవన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.