హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిలో ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించగా, మరొకరు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబ నేపథ్యం ఉన్న మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 9న నామినేషన్ వేయాల్సిందిగా వీరికి సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే ఇద్దరి పేర్లను క్యాబినెట్ సమావేశం తర్వాత ప్రకటించనున్నారు.
తెలంగాణ ఉద్యమసోపతి దేశపతి
తెలంగాణ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా మునిగడపలో దేశపతి గోపాలకృష్ణశర్మ, బాల సరస్వతి దంపతులకు 1970లో జన్మించారు. స్వరాష్ట్ర సాధనలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ నిర్వహించిన వేలాది సభలు, ర్యాలీల్లో దేశపతి పాల్గొన్నారు. తెలంగాణ సాధన అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా పని చేస్తున్నారు. దేశపతి ఎంపికపై ఎమ్మెల్సీ గోరటి వెంకన్న హర్షం వ్యక్తంచేశారు.
కేసీఆర్ అందించిన గౌరవమిది
సీఎం కేసీఆర్ నాకు అందించిన గౌరవం ఇది. నాపై నమ్మకంతో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి నందుకు సీఎంకు కృతజ్ఞతలు. ఆయన నమ్మ కాన్ని వమ్ము చేయను. – దేశపతి శ్రీనివాస్ సీఎంకు పాలమూరు నేతల కృతజ్ఞతలు ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన చల్లా వెంకట్రాంరెడ్డిని ఎంపిక చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు వాణీదేవి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, అంజయ్య, హర్షవర్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
ఎమ్మెల్సీ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామ్రెడ్డి మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో నవీన్‌కుమార్
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కుర్మయ్యగారి నవీన్‌కుమార్ 1978 మే 15న కొండల్రావు, తిలోత్తమ దంపతులకు జన్మించారు. నవీన్‌కుమార్ తాత రామచంద్రరావు గతంలో మంత్రిగా పనిచేశారు. మేనమామ సుదర్శన్‌రావు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. విద్యార్థి దశ నుంచే నవీన్‌కు రాజకీయాలంటే ఆసక్తి. 2001 నాటి జలదృశ్యం ఆవిర్భావసభ మొదలుకొని టీఆర్ఎస్ నిర్వహించిన అన్ని సమావేశాల్లో నవీన్ పనిచేశారు. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో సొంత ఖర్చులతో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారు. 2019 మేలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈ మార్చిలో పదవీకాలం పూర్తవనున్నది. ఆయన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్.. నవీన్‌కుమార్‌కు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మరోసారి నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామినవ్వడం గర్వంగా ఉన్నది.
– కుర్మయ్యగారి నవీన్‌కుమార్
మాజీ రాష్ట్రపతి మనుమడు చల్లా వెంకట్రామిరెడ్డి
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు (కూతురు కొడుకు) అయిన చల్లా వెంకట్రామిరెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు గ్రామ ప్రెసిడెంట్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 2004 నుంచి 2009 వరకు అలంపూర్ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. నిరుటి డిసెంబర్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, బీఆర్ఎస్లో చేరారు. ఈ క్రమంలో చల్లా వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు.
విజనరీ లీడర్‌షిప్‌లో పనిచేయటం గొప్ప అదృష్టం
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వంటి విజనరీ లీడర్‌షిప్‌లో పనిచేయటం గొప్ప అదృష్టం. తెలంగాణను దేశంలో ఆదర్శవంతమైన రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ తప్పకుండా రాణించి విజయం సాధిస్తారు. ఎమ్మెల్సీగా నాకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. ఆయన నమ్మకాన్ని నిలబెడతాను.
-చల్లా వెంకట్రామ్రెడ్డి
దేశపతి ఎంపికపై టీవీఎస్ కృతజ్ఞతలు
తెలంగాణ వికాస సమితి (టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఆ కమిటీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సాధనలో, బంగారు తెలంగాణ నిర్మాణంలో దేశపతి శ్రీనివాస్ చేసిన సేవలను గుర్తించిన సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సహ సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశపతి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.