హనుమకొండ, నవంబర్ 27: తెలంగాణకు వరంగల్ భవిష్యత్తు నగరంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. వరంగల్‌లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. ఓరుగల్లు నగరం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ప్రాపర్టీ షోను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, నమస్తే తెలంగాణ అడ్వర్టైజ్మెంట్ జీఎం ఎన్.సురేందర్రావుతో కలిసి వినయ్ భాస్కర్ ప్రారంభించారు.
మంత్రి కేటీఆర్ టీఎస్ బీపాస్‌ను అమలు చేయడంతో భవన నిర్మాణం, వెంచర్లకు సంబంధించిన అనుమతులు సులభతరం అయ్యాయని తెలిపారు. రింగ్‌రోడ్డు కారణంగా నగరం చుట్టూ వెంచర్లు, విల్లాలు, అపార్ట్మెంట్ కల్చర్ ఏర్పడిందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక భవన నిర్మాణరంగ సంస్థలు నగర అభివృద్ధికి కృషిచేస్తున్నాయని, మరిన్ని సంస్థలు సైతం ముందుకు రావాలని దాస్యం ఆకాంక్షించారు. ఇల్లు కొనుక్కోవాలనే వారి కలను నెరవేర్చుకొనేందుకు ఇది ఒక మంచి వేదిక అని పేర్కొన్నారు.
ప్రాపర్టీ షోను అద్భుతంగా నిర్వహించి నగర అభివృద్ధికి కృషి చేస్తుండటం అభినందనీయం అని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. అనంతరం స్టాళ్లను సందర్శించారు. నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ పి.అశోక్‌కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. కాగా, ప్రాపర్టీ షోకు మొదటి రోజైన ఆదివారం భారీ స్పందన వచ్చింది. హనుమకొండ, వరంగల్‌తో పాటు హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు, బ్యాంకులకు సంబంధించి మొత్తం 15 స్టాళ్లు ఏర్పాటు చేశారు.
ప్రాపర్టీ షో స్పాన్సర్లు
ప్రాపర్టీ షోలో మెయిన్ స్పాన్సర్‌గా ఏవీ ఇన్ఫ్రాకాన్, అసోసియేట్ స్పాన్సర్‌గా బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్, గిఫ్ట్ స్పాన్సర్‌గా నీలోఫర్, అసోసియేషన్ విత్ ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూడీసీసీబీ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు, కనకదుర్గా హోమ్స్, మైత్రీ ఇన్ఫ్రా ప్రాజెక్టు, జీఎంఆర్ గోకులం, మేఘా, అవని, జేఎస్ఆర్ సన్‌సిటీ, శశ్విత డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీషో మొదటి రోజైన ఆదివారం ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా పరిషత్ అధ్యక్షులు సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లోనూ వరంగల్ అభివృద్ధి
సీఎం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం లో వరంగల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. సామాన్యు ల సొంతింటి కల నెరవేరేలా ఒకే చోట అన్ని వివరాలు తెలియజేసేలా వరంగల్‌లో ప్రాపర్టీ షో నిర్వహించడం మంచి ఆలోచన అని కొనియాడారు. నగర అభివృద్ధిలో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు గతంలో కన్నా ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే వరంగల్ గ్లోబల్ సిటీల్లో స్థానం సంపాదించిందన్నారు. వరంగల్ నగరంలో ఐటీ, టెక్స్టైల్ పార్కులు వచ్చాయన్నారు.