హనుమకొండ చౌరస్తా, జనవరి 2: స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో మూడు రోజులుగా జరుగుతున్న సీఎం కప్ పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 2 వేల మంది పాల్గొన్న ఈ పోటీలు హోరాహోరిగా కొనసాగాయి. గురువారం జరిగిన రెజ్లింగ్ పోటీలలో హనుమకొండ జిల్లా క్రీడాకారులు 4 స్వర్ణ, ఒక రజత, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. అథ్లెటిక్స్ పోటీలలో హనుమకొండ క్రీడాకారులకు ఆరు పతకాలు దక్కాయి. విజేతలను జిల్లా క్రీడల యువజన అధికారి గుగులోత్ అశోక్‌కుమార్, తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కరీం, తదితరులు అభినందించారు.