చింతకాని, మార్చి 29: తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. దేశంలో తెలంగాణ అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా చింతకానిలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు, తెలంగాణ బీజేపీ ఎంపీలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పంజాబ్, ఇతర రాష్ర్టాల తరహాలో తెలంగాణ ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనాలని కోరారు. కొర్రీలు పెడితే ఇక్కడి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులతో పెట్టుకొన్న ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం మనలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.