సిద్దిపేట, అక్టోబర్ 7 : సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం బీజేపీ , కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. మోదీ 25 ఏండ్ల రాజకీయ ప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా బీజేపీ నాయకులు పట్టణంలో జ్యోతి కలశ యాత్ర ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గాంధీచౌక్ వద్దకు రాగానే ఎన్ఎస్యూఐ మహిళా కార్యకర్తలు రాహుల్‌గాంధీ అరెస్టుకు నిరసనగా మోదీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దీంతో రెండువర్గాల మధ్య మాటామాటా పెరిగి మహిళా కార్యకర్తలు జుట్టు పట్టుకొని లాకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు భైరి శంకర్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. ఎన్ఎస్యూఐ నాయకులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఏసీపీ రవీందర్‌రెడ్డి బీజేపీ నాయకులతో మాట్లాడి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో వెళ్లిపోయారు. బీజేపీ గూండాలు ఎన్ఎస్యూఐ కార్యకర్తలపై దాడి చేశారని, వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు.