హైదరాబాద్, ఆగస్టు9 (నమస్తే తెలంగాణ) : దేశంలో పేద, ధనికవర్గాల మధ్య ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని, వాటి నివారణకు కులగణన ఒక్కటే మార్గమని, లేకుంటే దేశంలో అంతర్యుద్ధం వాటిల్లక తప్పదని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ హెచ్చరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రం సంపన్నవర్గాల ప్రయోజనం కోసమే పని చేస్తున్నదని దుయ్యబట్టారు. దేశంలోని 271మంది బిలియనీర్లలో 94మంది 2023లోనే కొత్త బిలియనీర్లుగా మారారని, వారిలో ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ లేడని, దేశంలో ఆర్థిక అంతరాలకు ఈ గణాంకాలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాభీష్టాన్ని విస్మరి స్తే రాజకీయ పార్టీలకు మనుగడ ఉందని హెచ్చరించారు. సమావేశంలో బీసీ రా జ్యాధికార సమితి నేత మారేపల్లి లక్ష్మ ణ్, సీనియర్ జర్నలిస్టు దుర్గం శ్రీనివాస్, యువ నాయకులు కావలి రాజు, మల్లేశ్, సేనాపతి తదితరులు పాల్గొన్నారు.