హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ (పేపర్-1) కటాఫ్‌పై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే ఓవరాల్ కటాఫ్ తగ్గొచ్చని బ్రెయిన్ ట్రీ అకాడమీ డైరెక్టర్ గోపాలకృష్ణ విశ్లేషించారు. జనరల్ క్యాటగిరీలో 79, ఈడబ్ల్యూఎస్ 75, ఓబీసీ 77.50, ఎస్సీ 71.50, ఎస్టీ 68 మార్కులు కటాఫ్‌గా ఉండొచ్చని విశ్లేషించారు. నిరుడు జనరల్ క్యాటగిరీ కటాఫ్ 89 మార్కులుండగా, ఈ సారి తగ్గే అవకాశమున్నట్టు అంచనా వేశారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను ఆదివారం నిర్వహించారు. జాతీయంగా నిర్వహించిన ఈ పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు మధ్యస్తం నుంచి కాస్త కఠినంగా ఉన్నట్టు అభ్యర్థులు తెలిపారు.
ముఖ్యంగా చరిత్ర నుంచి అత్యధికంగా ప్రశ్నలిచ్చినట్టు అనలాగ్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ విన్నకోట శ్రీకాంత్ విశ్లేషించారు. చరిత్ర ప్రశ్నలు సులభంగానే ఉండటంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నట్టు తెలిపారు. కరెం ట్ అఫైర్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నట్టు విశ్లేషించారు. ప్రశ్నలు పెద్దవిగా, కాస్త కఠినంగా ఇచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. ఇచ్చిన ఆప్షన్ల నుంచి ఎలిమినేషన్ చేయలేని సందిగ్ధ స్థితిని ఎదుర్కొన్నట్టు అభ్యర్థి శశాంక్ తెలిపారు. ఎకానమీ, సోషల్ డెవలప్మెంట్ నుంచి 15, చరిత్ర, సంస్కృతి నుంచి 16, జనరల్ సైన్స్ నుంచి 9, ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్ నుంచి 16, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ నుంచి 13, జాగ్రఫీ 14, జనరల్ నాలెడ్జ్ 5, కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి 12 ప్రశ్నలు ఇచ్చినట్టు నిపుణులు తెలిపారు.
రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్షలు నిర్వహించారు. సివిల్స్ పరీక్షలకు ఈ సారి భారీగా 20వేల మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఒక్క గ్రేటర్‌లోనే 17,889 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. హైదరాబాద్‌లో పరీక్షలు రాసేందుకు 43,676 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 26,676 మంది పేపర్‌కు-1కు, 25,787 మంది పేపర్-2కు హాజరయ్యారు. పేపర్-1 రాసిన వారిలో 245 మంది పేపర్-2 పరీక్షకు గైర్హాజరయ్యారు. జూన్ 10న ఫలితాలు విడుదలకానున్నాయి.
హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక ‘కీ’ విడుదలయ్యింది. పేపర్-1, పేపర్-2 రెండింటి ప్రాథమిక ‘కీ’ని ఐఐటీ కాన్పూర్ ఆదివారం వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నెల 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తంచేయవచ్చు. జూన్ 2న ఫలితాలు విడుదలవుతాయి.